ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు వెల్లడించారు. కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత కెసియార్ కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాలు కళాశాలలు మంజూరు చేశారు కానీ తగినన్ని పోస్టులు ఇవ్వలేదని విమర్శించారు. కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా పీఆర్సీ అమలు చేసినదుకు తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు లెక్చరర్స్ ఐకాస ఆధ్వర్యంలో సిద్దిపేటలో కృతజ్ఞత సభ జరిగింది, మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా కాంట్రాక్టు లెక్చరర్లకు పీఆర్సీతో వేతనాలు ఇస్తున్నామని, ప్రతినెలా మొదటి వారంలోనే వీరికి వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగులు ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, కరోనాతో మృతి చెందిన కాంట్రాక్టు లెక్చరర్లకు సాయం అందిస్తామని వివరించారు.
అంతకుముందు సిద్దిపేటలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. సిద్ధిపేట.. శుద్ధిపేటగా కావాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల మేలు కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నామని, గతంలో మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులతో చాలా ఇబ్బందులు పడ్డామని ఆ వ్యాధులను ప్రజలకు దూరం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.