వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్రం తీరు అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అన్న రీతిలో ఉందని వ్యాఖానించారు. వ్యాక్సినేషన్ సకాలంలో పంపిణీ చేయడంలో కేంద్ర పూర్తిగా విఫలమైందని, దీనిపై తమ నిర్ణయాలను పున సమీక్షించుకోవాలని హరీష్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో హైరిస్క్ఉన్న ప్రజలకు వాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని హరీష్ రావు ప్రారంభించారు.
రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్ లను కేంద్రం ఇవ్వడంలేదని, కంపెనీలు, ఇతర దేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకోనివ్వడం లేదని ఆరోపించారు. మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ ను కూడా మనం కంపెనీల నుంచి కొనుక్కునే పరిస్థితి లేదని హరీష్ రావు విస్మయం వ్యక్తం చేశారు. ఓ వైపు కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ మరోవైపు రాష్ట్రాలను బద్నాం చేసేలా వ్యవహారిస్తుందన్నారు.
వ్యాక్సినేషన్ దిగుమతి చేసుకోవడంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరళతరం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ను కంపెనీలు తర దేశాల నుండి దిగుమతి చేసే చేసుకునే అవకాశం ఇవ్వాలని హరీష్ రావు కోరారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ 100 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చిందని, కానీ రాష్ట్రాలకు కేటాయించే వ్యాక్సిన్లు ఎన్ని ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చడం వల్ల కంపెనీలు టీకాలను తెలంగాణకు ఇవ్వలేక పోతున్నాయన్నారు.