సిఎం కేసియార్ బిసి వర్గాలను, యువతరాన్ని ప్రోత్రహిస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యువతకు రాజకీయంగా అవకాశాలు రావాలని అందరూ మాటలు మాత్రమే చెబుతుంటారని, కానీ కేసియార్ చేసి చూపిస్తున్నారని… రాష్ట్రంలో సామాజిక న్యాయం చేయాలన్నదే కేసియార్ సంకల్పమన్నారు. హుజురాబాద్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేసినందుకు సిఎం కెసిఆర్ కు తలసాని కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నామని వివరించారు. బడుగు, బలహీన వర్గాలకు సిఎం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని హుజురాబాద్ ప్రజలకు తలసాని విజ్ఞప్తి చేశారు, బిజెపిని గెలిపించడం వల్ల ఇప్పుడున్న ఇద్దరి ఎమ్మెల్యేల స్థానంలో ముగ్గురు అవుతారు తప్ప ఒరిగేదేమీ ఉండదని చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కూడా నోముల భగత్ ఘన విజయం సాధించారని, అదే రీతిలో గెల్లు కూడా విజయం సాధిస్తారని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. అభ్యర్ధిని ఎంపిక చేయకముందు నుంచే ప్రజలు హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు.
రైతు బంధు, దళిత బంధు కార్యక్రమాలపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని తలసాని మండిపడ్డారు. గొర్రెల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోందని, ఎక్కడైనా జరగడం లేదని నిరూపిస్తారా అంటూ సవాల్ చేశారు.
జైలుకు వెళ్ళివచ్చిన వారే జైళ్ళు అంటూ మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి పై తలసాని విమర్శించారు. సిఎం పట్ల ఎలాంటి భాష ఉపయోగించాలో కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని, అయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తాము హైదరాబాద్ లో పుట్టామని, మా కంటే బలవంతులు ఎవరున్నారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో రెచ్చిపోయి హామీలిచ్చిన బిజెపి నేతలు ఎక్కడకు పోయారని నిలదీశారు. తాటాకు చప్పుళ్ళకు భయపడే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఒర్వలేకపోతున్నాయని ఆరోపించారు.