Monday, January 20, 2025
HomeTrending Newsగవర్నర్ వ్యాఖ్యలపై మంత్రుల ఫైర్

గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రుల ఫైర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై  పలువురు మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఒక గవర్నర్ గా కాకుండా బిజెపి నాయకురాలిగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.  పదవి చేపట్టి మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా తమిళిసై నేడు రాజ్ భవన్ లో మీడియాతో మాట్లాడుటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి,  ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్ కు ఫ్యాషన్ గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి విమర్శించారు.  ఇది సరికాదని,  నిత్యం వార్తల్లో ఉండేదుకు ఆమె ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్ భవన్ ను ఉపయోగించుకుని గవర్నర్ బిజెపి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.  రాజ్యాంగబద్ధ  సంస్థలను గౌరవించడం లో  కేసీఆర్ ఎంతో పరిణితి చూపుతారని, ఇలా మర్యాదగా వ్యవహరించే నాయకుడు మరొకరు లేరని స్పష్టం చేశారు. గౌరవంగా రాజ్ భవన్ ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయదాన్ని ఆమె విజ్ఞత కే వదిలేస్తున్నామన్నారు.

గవర్నర్ బిజెపి నాయకురాలు గా మాట్లాడుతున్నారని, ముందు ఆమె తన పని తాను చేసుకోవాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ ఎప్పుడు రావాలన్నది ఆయన ఇష్టమని, దీనిపై ఆమె పరిధి దాటి మాట్లాడారని అన్నారు.   వరదలు వస్తే బాధితులకు ప్రభుత్వం అండగా ఉండగా, ఆ ప్రాంతాల్లో పర్యటించాల్సిన అవసరం మీకేంటని ప్రశ్నించారు.  రాజ్ భవన్ కు ఎవరూ రాకుంటే ఫోన్ లు చేసి మరీ పలిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదు అందుకే విమోచనం అంటున్నారని విమర్శించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళ ల పట్ల చాలా గౌరవం ఉందని, గవర్నర్ విషయంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమె సమీక్షించుకోవాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్