Botsa Bill: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నివసించే ఇంటి పవర్ బిల్లుపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తను తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు ఖండించారు. అది అవాస్తవమని బొత్స ఇంటిపై ఎలాంటి బాకీ పెండింగ్ లో లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులపై తెలంగాణా మంత్రి కేటిఆర్ మొన్న శుక్రవారం చేసిన వ్యాఖ్యలను బొత్స ఖండిస్తూ.. తెలంగాణాలో కూడా పవర్ కట్స్ ఉన్నాయని, తాను అక్కడే ఉండి వస్తున్నానని, కరెంట్ సమస్యతో జనరేటర్ వాడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. దీనిపై టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు బొత్సపై విమర్శలు చేశారు. కొందరు దీనిపై మరింత ముందుకెళ్ళి…తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పేరిట ఓ నకిలీ ట్వీట్ తయారు చేసి ‘మీరు కరెంట్ బిల్ క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరెంట్ సరఫరా చేస్తాం’ అంటూ సామాజిక మధ్యమాల్లో వైరల్ చేశారు.
ఈ ట్వీట్ ను సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎంపీ రఘుమా రెడ్డి ఖండించారు. తమ అధికారిక ఖాతాల్లో దీనిపై ఎలాంటి ట్వీట్ చేయలేదని స్పష్టం చేశారు. ఎవరో తప్పుడు ఖాతా సృష్టించి ఇలా చేశారని వివరణ ఇచ్చారు.
ఈ వివరణను జత పరుస్తూ బొత్స ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ‘ట్రూత్ ప్రివైల్స్’ అంటూ ఏక వాక్యంతో ట్వీట్ లను జత చేశారు.
Also Read : కేటియార్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం