Thursday, March 19, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వినాయకుడికి టీటీడీ పట్టు వస్త్రాలు

వినాయకుడికి టీటీడీ పట్టు వస్త్రాలు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డికి డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, శాసన సభ్యులు ఎం.ఎస్.బాబు, కాణిపాకం ఆలయ ఈవో వెంకటేసు స్వాగతం పలికారు.  అనంతరం ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్దంగా పరివట్టం కట్టి తలమీద పట్టు వస్త్రాలు, పూలమాలలు ఉంచారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య వీరు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు.  అతిథులకు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో వెంకటేసు టీటీడీ చైర్మన్ దంపతులతో పాటు మిగిలిన అతిథులకు స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందించారు.

బంగారు రథాన్ని పరిశీలించిన చైర్మన్
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు రథాన్ని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. శ్రీ వినాయక స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమన్నారు సుబ్బారెడ్డి. కాణిపాకం ఆలయం బంగారు రథం నిర్మాణానికి టీటీడీకి రూ. 6 కోట్లు చెల్లించిందని చెప్పారు.  ప్రభుత్వ అనుమతితో టీటీడీ తన వద్ద ఉన్న బంగారం ఉపయోగించి రథం నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు. కోవిడ్ కారణంగా రథం నిర్మాణం పనులు ఆలస్యం అయ్యాయని సుబ్బారెడ్డి తెలిపారు.

కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయట పడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం, పది రోజుల్లో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్ళు నియమించే అవకాశం ఉందని సుబ్బారెడ్డి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular