నిజాం రాచరిక ఆలోచనలతో సిఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్ ను ఆహ్వానించకపోవడం.. అడ్డుకోవడం.. కొంతమందిపై నిషేధం విధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇది విచారణకరమన్న కిషన్ రెడ్డి.. దీనిని తీవ్రంగా ఖండించాలన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన మన్ కి బాత్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి…మీడియాతో మాట్లాడుతు కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. పత్రికలు, ప్రసార సాధనాలకు ప్రభుత్వ విధానాలను విమర్శించే అధికారం ఉంటుందన్నారు. “విమర్శించారన్న నెపంతో గతంలో టీవీ9, V6, ఏబీఎన్ ఛానల్స్ ను నిషేధించారు. 10 కి.మీ. లోతున భూమిలో పాతిపెడతానన్నారు. సీఎం అర్థం చేసుకోవాలి.. ప్రసార సాధనాల అండతోనే తెలంగాణ ఉద్యమం సాగింది. ప్రజల ఆందోళనలు అడ్డుకోవడం.. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ఎంత వరకు సమజం” అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2016 నుంచి సెక్రటేరియట్ కు రాకుండా పాలన సాగించారు. ప్రజల రావడానికి అవకాశం లేని ప్రగతి భవన్.. సీఎం రాని సచివాలయం ఎందుకని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. తొమ్మిదిన్నర ఏళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి.. 4 నెలల్లో సచివాలయం మాత్రం కట్టుకున్నారన్నారు.