రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. దీంతో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం పేర్కొన్నది. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ భూయాన్‌కు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి కల్పించారు. మరో వైపు ఢిల్లీ, బాంబే, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964, ఆగస్టు 2వ తేదీన అసోంలోని గువహటిలో జన్మించారు. ఈయన తండ్రి సుచేంద్ర నాథ్ భూయాన్ కూడా సీనియర్ న్యాయవాది. అసోం అడ్వకేట్ జనరల్‌గా కూడా పని చేశారు. భూయాన్ తన పాఠశాల విద్యను గువహటిలోని డాన్ బాస్కో స్కూల్లో పూర్తి చేశారు. ఉన్నత విద్యను కాటన్ కాలేజీలో అభ్యసించారు. ఢిల్లీలోని కిరోరి మాల్ కాలేజీలో డిగ్రీలో పట్టా పొందారు. గువహటిలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారు. గౌహతి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు.
ఇక 1991, మార్చి 20వ తేదీన బార్ కౌన్సిల్ ఆఫ్ అసోంలో తన పేరును నమోదు చేసుకున్నారు భూయాన్. గౌహతి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా 2011 అక్టోబర్ 17న నియామకం అయ్యారు. 2019లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ జడ్జిగా సేవలందించారు. 2021, అక్టోబర్‌లో తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియామకం అయ్యారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు.
Also Read : తెలంగాణ హైకోర్టు నూతన జడ్జిల ప్రమాణస్వీకారం