తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అయ్యారు. కొత్త సీజే జస్టిస్ భుయాన్ కు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు అనంతరం అయిదో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
దాదాపు ఏడాది కాలంగా గవర్నర్ వర్సెస్ సీఎం అన్నట్లుగా వ్యవహారం సాగుతుండటం, రాజ్ భవన్ – ప్రగతి భవన్ నుంచి పరస్పర విరుద్ధ, పోటాపోటీ ప్రకటనలు వెలువడటం, సీఎం తీరుపై గవర్నర్ కేంద్రానికి సైతం ఫిర్యాదులు చేయడం జరిగింది. మంత్రులు, నేతలు గవర్నర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు కొనసాగించడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య సీఎం కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత రాజ్ భవన్ కార్యక్రమానికి రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన కార్యక్రమం కావడంతో విభేదాలను పక్కనపెట్టిమరీ కేసీఆర్ హాజరయ్యారు.