చాలా మంది చిన్న చిన్న వ్యాధులకు వారే మందులు కొనుక్కొని వేసుకుంటుంటారు. మరికొందరైతే మెడికల్ షాపుల వారిపై ఆధారపడతారు. కొంతమంది మాత్రం మామూలు జ్వరం వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తారు. ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చిన తరువాత గూగులమ్మ చెప్పే సూచనలు…..కరోనా తర్వాత వంటింటి చిట్కాలు పాటించేవారు కూడా ఎక్కువయ్యారు.
కొత్త వ్యాధి ఏదైనా వచ్చినప్పుడు డాక్టరును సంప్రదిస్తుంటాం. వారు వెంటనే అడిగే ప్రశ్న… మీ కుటుంబంలో పెద్దలు ఎవరికైనా ఈ వ్యాధి ఉందా?…అని. వంశపారపర్యంగా కొన్ని వ్యాధులు వస్తుంటాయి. దానికనుగుణంగా వారు మందులు ఇస్తుంటారు. జన్మతః ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రుల నుంచి డిఎన్ఏ సహజంగా వస్తుంది. దీని ద్వారా వారి వారసత్వం, పెరుగుదల, వ్యాధులు లాంటివాటిని నిర్ధారిస్తారు. వైద్య రంగంలో DNA టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. వ్యాధుల నిర్ధారణ, నివారణ, చికిత్సలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్యంపై కొంత అవగాహన ఏర్పరచుకొని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది దోహదం చేస్తోంది.
ఆర్టిఫిషియల్ హ్యూమన్ డిఎన్ఏ ఎక్స్ పెరిమేంట్ పేరిట సరికొత్త ప్రయోగానికి యూకే శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. రసాయనాల సాయంతో కృతిమ డిఎన్ఏ ను ప్రయోగశాలల్లో సృష్టించబోతున్నారు. ఆధునిక యుగంలో మనుషులు పారంపర్యంగానే కాకుండా ఆహార అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం లాంటి వాటితో సరికొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ కారణంగానే చిన్న వయసులోనే గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిక్ లాంటి సమస్యలు ఎదుర్కొంటూ కొందరు హఠాత్తుగా ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితిని చూస్తున్నాం.

ప్రజల జీవన ప్రమాణం, ఆయుర్దాయం, ప్రాణాంతక వ్యాధులకు చికిత్స లక్ష్యంగానే ఈ తాజా ప్రయోగాలు మొదలు పెట్టినట్లు దీనిలో కీలక పాత్ర పోషిస్తోన్న డాక్టర్ జూలియన్ సాలె అంటున్నారు. వయసు పెరుగుదలను నెమ్మదించడం, రోగాలు ఎదుర్కొనే శక్తి కూడా కృత్రిమ డిఎన్ ఏ ద్వారా సాధ్యమని ఆయన ధీమాగా చెబుతున్నారు. అయితే వీటి ద్వారా జీవాయుధాలు తయారు చేసే ప్రమాదం లేకపోలేదని, మరికొన్ని కొత్త వ్యాధులు వస్తే వాటి సంగతేమిటని మరికొందరు శాస్త్రవేత్తలు సందేహాలు వెలిబుచ్చుతున్నారు.
ప్రతి ప్రయోగంలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. మానవాళికి ఉపకరించే ఆవిష్కరణలనూ ఎప్పుడూ స్వాగతించాల్సిందే. ఈ సరికొత్త కృత్రిమ డిఎన్ఏ ప్రయోగం కూడా మానవ జీవన వికాసానికి ఉపయోగపడాలని కోరుకుందాం.

