Saturday, November 23, 2024
HomeTrending Newsరాష్ట్రంలో నిర్మలా సీతారామన్ పర్యటన

రాష్ట్రంలో నిర్మలా సీతారామన్ పర్యటన

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఆమె విశాఖపట్నం చేరుకుంటారని, రేపు (ఆగస్టు 7న) జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె పాల్గొంటారని, శ్రీకాకుళం జిల్లాలో పొందూరు చేనేత క్లస్టర్ ను ఆమె పరిశీలిస్తారని బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ వెల్లడించారు. రేపు సాయంత్రం చినవాల్తేర్ లోని ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె సందర్శిస్తారని వివరించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో ఆగస్ట్ 8న కే.డి.పేట లో విప్లవ వీరుడు, మన్యం ముద్దు బిడ్డ, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు సమాధిని కేంద్రమంత్రి దర్శించుకుంటారని మాధవ్ వివరించారు. ఆ తర్వాత తాళ్ళపాలెంలోని ప్రజాపంపిణీ కేంద్రాన్ని పరిశీలించి  కేంద్రం అందిస్తోన్న గరీబ్ కళ్యాణ్ యోజన అమలును పర్యవేక్షిస్తారని, లబ్ధిదారులతో కూడా మాట్లాడతారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ఇస్తున్ననిధులకు పేర్లు మార్చి సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.  సర్వ శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ ‘నాడు-నేడు’ పేరుతో అమలు చేస్తున్నారని సోము తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం తాము అమలు చేస్తున్న పథకాలపై కనీసం సమీక్ష నిర్వహించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు నిధులు మంజూరు చేస్తున్నా వాటిని రాష్ట్రంలో సరిగా అమలు చేయడంలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలతో ఆరు లైన్ల రహదారులు నాలుగు నిర్మిస్తున్నామని, జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కనీసం రెండు వేల కోట్ల రూపాయలతో రోడ్లు కూడా బాగు చేయలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు సోము.  జనాదేశ్ యాత్రలో భాగంగా ఈనెల 16న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో పర్యటిస్తారని సోము వెల్లడించారు. రాత్రికి తిరుమల చేరుకొని 16 ఉదయం విజయవాడ వస్తారని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్