Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇండియా దట్ ఈజ్ భారత్

ఇండియా దట్ ఈజ్ భారత్

Name-Political Game: పేరు పెట్టి పిలవడం మర్యాద- గౌరవం కాకుండా పోవడంతో నామం వెనక్కు వెళ్లి సర్వులకూ నీవు, మీరు, తమరు సర్వనామాలే గౌరవమయ్యాయి. పేరు చెప్పుకుని…కాళ్ల మీద పడే సీన్లు పురాణాల నిండా కోకొల్లలు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్న, అముతున్న, అమ్మబోయేవారి లెక్క అనంతం.

కొందరి పేరు పేరుకు అంటే నేమ్ సేక్ ఉంటుందంతే. వారికి ఇంకేదో పేరు వాడుకలో ఉంటుంది. ఒక్కోసారి ఆ పేరు బహిరంగంగా చెప్పడానికి వీలు కానంత అభ్యంతరకరమయినదిగా కూడా ఉండవచ్చు.

పేరుకు అర్థం ఉండడం ఓల్డ్ ఫ్యాషన్. అర్థం లేని, ఉన్నా పలకడానికి వీలు కాని పేర్లు పెట్టుకోవడం లేటెస్ట్ ట్రెండ్. తండ్రి పేరు నరసింహ. తల్లి పేరు హాసిని. వారి ముద్దుల పాపకు వారు పెట్టుకున్న పేరు “నరహా”. భాషోత్పత్తి శాస్త్రవేత్తలు కూడా ఇంత సాహసానికి ఒడిగట్టలేరు. బహుశా ముద్దు పేరు ముచ్చటగా నర; రహా; హా ల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అమెరికా నుండి భారత్ తిరిగి వచ్చి ఇక్కడే స్థిరపడ్డ దంపతుల పేర్లు వినోద్- శ్రావణి. వాళ్ల అబ్బాయికి చక్కగా “విశ్రా” అని పేరు పెట్టుకున్నారు. లోకంలో ఎవరికీ లేని పేరు కావడం, అమ్మా నాన్నల ఇద్దరి పేర్లు కలిసి కొత్త పేరు ఏర్పడడం తప్ప ఇందులో అర్థం, పరమార్థాల జోలికి వెళ్లకూడదు.

ఒక పదం ఎలా పుట్టి, ఎన్నెన్ని రూపాల్లో మారుతూ ఉంటుందో భాషాశాస్త్రం స్పష్టంగా నిర్వచిస్తుంది. ఆ పదానికి వ్యుత్పత్తి అర్థాన్ని పట్టుకుంటుంది. ఆ పదానికి కాల లింగ వచనాలు తోడయినప్పుడు ఎలా మారుతుందో చెబుతుంది. అలా మన దేశానికి అనాదిగా జంబూ ద్వీపం, భరత వర్ష్, భరత ఖండం, భారత్ అనే పేర్లున్నాయని మన నమ్మకం. 1947లో స్వాతంత్య్రం రావడానికి ముందు అనేక విడి విడి స్వతంత్ర రాజ్యాలే ఉండేవి కానీ…ఒకే ఒక భరత ఖండం ఎప్పుడు ఉండేదో చెప్పగలిగిన వారు లేరు. వేద మంత్రాలు, పురాణాల్లో మాత్రం స్పష్టంగా “భరత ఖండం” అని ఉన్నమాట నిజం. అదే ఇప్పటికీ సంకల్పంలో భరత ఖండే అని చెప్పుకుంటున్నాం. చివరికి రామాయణం, భారతంలో కూడా అనేక దేశాలు, అనేక రాజ్యాలు, అనేక రాజుల ప్రస్తావనలు కోకొల్లలు.

విశ్వామిత్రుడి తపో భంగం కోసం ఇంద్రుడు మేనకను పంపాడు. విశ్వామిత్రుడి వల్ల మేనకకు పుట్టిన బిడ్డ శకుంతల. తపో భంగం పని పూర్తి కాగానే బిడ్డను నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలేసి మేనక మళ్లీ స్వర్గానికి వెళ్లిపోయింది. విశ్వామిత్రుడు అయ్యో నా పదివేల ఏళ్ల తపస్సంతా గంగలో కలిసిందే అని బాధపడుతూ బిడ్డను గాలికొదిలేసి మళ్లీ తపస్సుకు వెళ్లిపోయాడు. పసి బిడ్డను తీసుకెళ్లి చెట్ల పొదల్లో శకుంతల పక్షులు పెంచాయి కాబట్టి ఆ అమ్మాయికి శాకుంతల అని పేరు పెట్టి…కణ్వుడు పెంచుకున్నాడు. అక్కడికి వేటకొచ్చిన దుష్యంతుడు శకుంతల మీద మనసు పడి…శారీరకంగా కలిశారు. తీరా గర్భవతి అయ్యాక నిండు కొలువులో నువ్వెవరో తెలియదు పొమ్మన్నాడు దుష్యంతుడు. చివరకు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం ఉంగరం చూపితే…అయ్యో నా మతి మండ! మరిచేపోయాను. నువ్ శకుంతల కదా! గుర్తొచ్చింది… పద అంతఃపురంలోకి అని ఏలుకున్నాడు. ఈ దుష్యంతుడు- శకుంతలకు పుట్టిన భరతుడే మనమనుకునే భరత ఖండాన్ని అనితరసాధ్యంగా పరిపాలించాడు. అప్పటి నుండి ఈ భూభాగానికి భరత ఖండం అనే పేరు స్థిరపడింది.

ఈ భరత ఖండ అభిజ్ఞాన శాకుంతలాన్ని గౌరవించని బ్రిటీషు వారు భారత్ ను ఇండియా అని మార్చారు. ఇన్నాళ్లకు బి జె పి వాళ్లు మళ్లీ ఇండియాను భారత్ చేయాలనుకుంటున్నారు. ప్రతిపక్షాలు తమ కూటమికి “ఇండియా” అని పేరు పెట్టుకుంటే…భారతీయ పేరు మొదట్లోనే పెట్టుకున్న పార్టీ “భారత్” నామాస్త్రాన్ని అమ్ముల పొదిలో నుండి తీయడంలో ఆశ్చర్యం ఏముంది?

ఇండియా దటీజ్ భారత్ ఇప్పుడు పేరుమార్పు సంధి దశలో ఉంది. ఇది ఇక్కడితో ఆగదు. పేరు మార్పుతో బి జె పి ఆశిస్తున్న ప్రయోజనాలు బహిరంగ రహస్యం. ఈ మార్పును వ్యతిరేకించేవారు దేశవ్యతిరేకులు కావాల్సి ఉంటుంది కాబట్టి…వ్యతిరేకించలేరు. ఇంతకంటే లోతుగా వెళితే…మన జ్ఞానం కూడా అభిజ్ఞాన శాకుంతలం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి…భరత వర్షే…భరత ఖండే నామస్మరణ సంకల్పాన్ని స్మరించడమే ఉత్తమం!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్