Rules Ranjann Trailer: కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ ట్రైలర్ విడుదల

కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటించింది. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలను అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

‘రూల్స్ రంజన్’ ట్రైలర్ ను ఈరోజు(సెప్టెంబర్ 8) ఉదయం 11:22 గంటలకు విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తండ్రి పాత్రధారి గోపరాజు రమణ “ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?” అని అడగగా.. కథానాయకుడు కిరణ్ అబ్బవరం “బీర్ ఓకే” అని చెప్పే సంభాషణతో ట్రైలర్ సరదాగా ప్రారంభమైంది. “సన్నీ లియోన్ హస్బెండ్ నాకు ఇన్ స్పిరేషన్”, “పెళ్ళయితే మీ పెళ్ళాలకు ప్రెగ్నెన్సీ రావాల్సింది, మీకు వచ్చింది ఏంటి?” వంటి వరుస మాటల తూటాలతో 100 శాతం వినోదం గ్యారెంటీ అనే నమ్మకం కలిగిస్తోంది. నాయకానాయికల మధ్య సన్నివేశాలు కూడా హాస్యంతో కూడి మెప్పిస్తున్నాయి. కలిసి కాలేజ్ లో చదువుకున్న వారు చాలాకాలం తరువాత కలవడం, సనా(నేహా)ని మెప్పించడానికి రూల్స్ రంజన్ లా ఉండే మనో రంజన్ కాస్తా పబ్ రంజన్ గా మారడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

అసలు రూల్స్ రంజన్, పబ్ రంజన్ గా ఎందుకు మారాడు? మందు వల్ల అతని ప్రేమకి, స్నేహానికి వచ్చిన సమస్య ఏంటి? అతని ప్రేమ ఫలించిందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది ట్రైలర్. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన ప్రతిభ కనబరుస్తున్నారు. అలాగే ట్రైలర్ లో విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *