Friday, October 18, 2024
HomeTrending Newsకోవిడ్ రోగులకు ఇబ్బంది రాకూడదు : సిఎం జగన్

కోవిడ్ రోగులకు ఇబ్బంది రాకూడదు : సిఎం జగన్

తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారిని తరలించాల్సి ఉంటే వెంటనే ఆ పని చేయాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, రీఫిల్లింగ్ ప్లాంట్లకు  విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో తుపాను పరిస్థితిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

కోవిడ్ ఆస్పత్రులకు విద్యుత్ సిబ్బందిని కేతాయించాలని, తుపాను పరిణామాలను ముందుగానే ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని, సహాయ శిబిరాల్లో అన్ని సదుపాయాలూ సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను అప్రమత్తం చేశామని అధికారులు సిఎంకు వివరించారు,.

అంతకుముందు బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను  పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటి జరిగింది. ఏపి సిఎం జగన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తుపాను కదలికలను పరిశీలిస్తే ఆంధ్ర ప్రదేశ్ పై ప్రభావం స్వల్పంగా ఉండే అవకాశం ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకెళ్తామని జగన్ అమిత్ షాకు వివరించారు.  ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్