కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో 12.25 గంటలకు సున్నిపెంటకు వచ్చి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకోనున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో మధ్యాహ్న భోజనం చేస్తారు.
మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి 3.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరతారు. కేవలం శ్రీశైలం దర్శనానికి మాత్రమే ఈ పర్యటన పరిమితం కానుంది. జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాస్తవానికి ఈ నెల 13వరకూ జరగాల్సి ఉంది. అయితే, పెగాసస్ అంశంపై విపక్షాల ఆందోళనలతో సభా కార్యక్రమాలు ముందుకు సాగకపోవడంతో కేవలం కొన్ని ముఖ్యమైన బిల్లులను ఆమోదించుకొంది మోడీ ప్రభుత్వం. నిర్ణీత సమయం కంటే రెండ్రోజుల ముందే అంటే బుధవారం నాటికే పార్లమెంట్ ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీనితో ఈ రోజు సమయం చిక్కడంతో అమిత్ షా శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి దర్శనం కోసం శ్రీశైలం వస్తున్నట్లు తెలిసింది.