ఉపాధ్యాయులు ఈ నెల 25వ తేది నుంచి పాఠశాలలకు హాజరు కావాలని విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం కూడా జీఓ 46 ప్రకారమే ఫీజులు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఒకటి రెండు రోజుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశమవుతామని మంత్రి వెల్లడించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పలితాలు వచ్చే వారం ప్రకటిస్తామన్నారు.
జులై ఒకటో తేది నుండి జులై నెలాఖరు లోపు డిగ్రీ,పిజి పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి సబిత విద్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. జులై ఒకటి నుండి డిగ్రీ , పిజి , ఇంజనీరింగ్ ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
హై స్కూల్, ఇంటర్ తరగతుల పై సంక్షేమ శాఖ మంత్రులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం చేస్తామన్నారు. రెండు రోజుల్లో సంబందిత అధికారులతో సమావేశమవుతామన్నారు. త్వరలోనే ఉపాధ్యాయులకు, డిగ్రీ, పిజీ విద్యార్థులకు వాక్సినేషన్ కార్యక్రమం చేపడుతామని మంత్రి వెల్లడించారు.
మరోవైపు పాఠశాలల పునః ప్రారంభం, ప్రత్యక్ష తరగతుల పై పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. జులై ఒకటో తేది నుంచి 8 ,9,10 తరగతులు ప్రారంభించాలని, ఉదయం 9.30 నుంచి 3.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారు.
జులై 20వ తేది నుంచి 6 ,7 తరగతులు ప్రారంభించి, ఆగస్ట్ 16వ తేది నుంచి 3, 4,5 తరగతులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రెండు రోజుల్లో విద్య శాఖ ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.