Saturday, January 18, 2025
HomeTrending Newsటీకా పరీక్ష కేంద్రం ఇవ్వండి – మంత్రి కేటీఆర్  

టీకా పరీక్ష కేంద్రం ఇవ్వండి – మంత్రి కేటీఆర్  

ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రాధాన్యత సంతరించుకున్న హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిందని,  ఇప్పటికైన ఈ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ మరియు కేంద్ర మంత్రి సదానంద గౌడ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

దేశీయంగా తయారు చేసిన కోవాక్సిన్ తో పాటు స్పుత్నిక్ వి, కోర్బావాక్స్, భారత్ బయోటెక్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీల వ్యాక్సిన్లు సైతం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని కేటీఆర్ తెలిపారు. కేంద్రం చేపట్టబోయే వ్యాక్సినేషన్ ప్రక్రియకు సుమారు 100 కోట్ల డోసులు హైదరాబాద్ నగరం నుంచి రానున్న ఆరు నెలల్లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ నగరంలో వాక్సినేషన్ టెస్టింగ్ సెంటర్ లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

దేశంలో ఉన్న ఏకైక వాక్సిన్ టెస్టింగ్ కసౌలి లో ఉన్నదని, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సెంటర్ కి ఇక్కడి సంస్థలు తయారు చేసే ప్రతి బ్యాచ్  వ్యాక్సిన్ ని టెస్టింగ్ కు పంపాల్సిన అవసరం ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానాల్లో అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కసౌలి వెలుతున్నారని, మొత్తం ఈ టెస్టింగ్ ప్రక్రియకి 30 నుంచి 45 రోజుల సమయం పడుతుందన్నారు. దీని ద్వారా విలువైన సమయం వృధా అవుతోందన్నారు.

రెండవ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుతో మరింత వేగంగా హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచే అవకాశం ఉంటుందని మంత్రి కేంద్రాన్ని కోరారు. తక్కువ సమయంలో ఎక్కువ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలంటే, విలువైన 30-45 రోజుల సమయాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లో వ్యాక్సింగ్ టెస్టింగ్ సెంటర్ అత్యావశ్యకమైన విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు.

దేశంలోనే అత్యధిక వ్యాక్సిన్ తయారీ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నందున ఆయా కంపెనీలకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇక్కడ సెంటర్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ వాక్సిన్ టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తే ప్రతి నెల 8 నుంచి 10 కోట్ల అదనపు వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే వీలు కలుగుతుందని తెలిపారు. ప్రపంచమంతా మూడవ దశ కరోనా, సెప్టెంబర్ – డిసెంబర్ నెల మధ్యలో వచ్చే అవకాశం ఉందని, దాన్ని ఎదుర్కోవాలంటే సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ వేయడమే పరిష్కార మార్గమని మంత్రి కేటీఆర్ తెలిపారు.

టీకా పరీక్షా కేంద్రం ఏర్పాటుకు కేంద్రం ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం తరపున ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్