Mini Review: ఏ సినిమా కోసం ఏ కథను ఎంచుకున్నా, ఫైనల్ గా ఆ కంటెంట్ నుంచి సగటు ప్రేక్షకుడు ఆశించేది వినోదమే. హీరో ఏ జాబ్ చేస్తున్నాడు .. ఎంత నిజాయితీగా ఉన్నాడు .. సామాజిక బాధ్యతను ఎంతవరకూ మోస్తున్నాడు .. ఆయన పాత్ర ఇవ్వదలచుకున్న సందేశం ఏమిటి? అనే అంశాలన్నీ కూడా వినోదాన్ని ప్రధానంగా చేసుకునే నడవాలి. ప్రేక్షకుడిని కూడా కథలో ఒక పాత్రగా చేసి నడిపించాలి. సీరియస్ కథను సీరియస్ గా ఫాలో కావడానికి ప్రేక్షకుడు ఎప్పుడూ ఆసక్తిని చూపించడు అనే విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి.
నిన్న విడుదలైన ‘గాండీవధారి అర్జున’ విషయానికి వస్తే, వినోదమే లోపించిందనే విషయం అర్థమవుతుంది. డైరెక్టర్ గా ప్రవీణ్ సత్తారు ఏ విషయాన్ని అయితే ఈ కథ ద్వారా చెప్పదలచుకున్నాడో, ఆ విషయాన్ని చాలా నీట్ గా చెప్పాడు. ఈ విషయంలో ఆయన ఎక్కడా తడబడలేదు. లండన్ రోడ్లపై హాలీవుడ్ రేంజ్ ఛేంజింగ్ సీన్స్ ను తీయడం అంత తేలికైన విషయమేం కాదు. కథకి తగిన విజువల్స్ తో కట్టిపడేశాడనే చెప్పాలి. అయితే ప్రేక్షకుడు ఆ యాక్షన్ చుట్టూ వినోదం కూడా ఉండాలని కోరుకుంటాడు.
కథలో హీరో తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది .. దేశం ఆపదలో ఉంటుంది .. హీరో పట్ల హీరోయిన్ కోపంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కామెడీని గానీ .. రొమాన్స్ ను గాని ఆశించలేం. అలాంటి ప్రయత్నాలు చేస్తే, అవి కథకి అడ్డుపడతాయి కూడా. అయితే ఈ సమస్యలేం లేని హీరో – హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అప్పుడైనా కనీసం రొమాన్స్ కి ఛాన్స్ ఇవ్వవలసింది. కరివేపాకులా కాస్త కామెడీ వేయవలసింది. ప్రవీణ్ సత్తారు తాను అనుకున్నది అనుకున్నట్టుగా తీసినా, ప్రేక్షకుడి వైపు నుంచి ఈ రెండు అంశాలే అసంతృప్తిని కలిగిస్తాయంతే.