దేవినేని ఉమా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, మైలవరంలో ఉద్రిక్తతలకు ఆయనే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. తాను ఈ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా వచ్చినప్పటినుంచీ దేవినేని తనను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మంత్రిగా ఉండగా అటవీ భూములకు వ్యవసాయ భూములుగా అనుమతి ఇప్పించి అక్రమ మైనింగ్ జరిపించిందే ఉమా అని కృష్ణప్రసాద్ వెల్లడించారు.
నిన్నటి సంఘటన ఉమా ఉద్దేశ్యపూర్వకంగా చేయించారని కృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చిన స్థలాన్ని చదును చేస్తుంటే అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అక్రమ మైనింగ్ స్థలాన్ని రాత్రిపూట ఎవరైనా పరిశీలిస్తారా అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో అనుచరులను తీసుకువెళ్ళి తమ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. ప్రతిపక్ష అనుకూల మీడియాలో చూపిస్తున్న ధ్వంసమైన వాహనం వైసీపీ కార్యకర్తది అయితే ఉమా కారు అద్దాలు పగలగొట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఉమాపై దాడి జరిగిందంటూ కట్టుకథలు అల్లుతున్నారని చెప్పారు.
ప్రశాంతంగా ఉన్న మైలవరం నియోజకవర్గంలో అల్లర్లు సృష్టిస్తున్నారని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి నాదే బాధ్యత అంటూ దేవినేని పిచ్చి ప్రేలాపలనలు చేస్తున్నారని వసంత మండిపడ్డారు. ఇకనైనా బుద్ధిగా ఉండాలని హితవు పలికారు.