Sunday, January 19, 2025
HomeTrending Newsచంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి: వసంత

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి: వసంత

ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచించారు. దేవినేని కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడిన అంశాలపై వసంత స్పందించారు. దేవినేని ఉమా అరెస్టు, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ మైనింగ్ విషయంలో అన్ని అంశాలూ బాబుకు తెలుసనీ, ఉమా చేసింది తప్పు అని కూడా బాబుకు తెలుసని, తమ తప్పు కప్పిపుచ్చుకోవడం కోసమే అయన అలా మాట్లాడారని అని కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.  పార్టీ పరువు, ప్రతిష్ఠ లు కాపాడుకోవడం కోసమే బాబు పరామర్శకు వచ్చారని వ్యాఖ్యానించారు.

తమకు జగన్ ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ దేవినేనిని ప్రజలు నిలదీశారని, ఈ సందర్భంలో టిడిపి శ్రేణులే తమ పార్టీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ కారుపై దాడి చేసి ధ్వంసం చేశారని ఆరోపించారు. కారు డ్రైవర్, దళిత వర్గానికి చెందిన వ్యక్తిపై కూడా దాడి చేసి గాయపరిచారని, దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారని వసంత  వివరించారు. ఎప్పటినుంచో జైలుకు వెళ్ళాలని ఉమా కు ఉబలాటంగా ఉందని, పోలీసులు దాన్ని తీర్చారని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం దేవినేని ఈ డ్రామాలు ఆడుతున్నాడని, తాను తీసుకున్న గోతిలో తాను పడ్డాడని ఉమను ఉద్దేశించి వసంత వ్యాఖ్యానించారు.

అటవీ భూములను వ్యవసాయ రెవెన్యూ భూములుగా మార్పించి మైనింగ్ కు పర్మిషన్ ఇప్పించిందే ఉమా అని వసంత పునరుద్ఘాటించారు.  తాను ఎమ్మెల్యేగా గెలుపొంది రెండేళ్ళు మాత్రమే అయ్యిందని,  యాభై ఏళ్ళుగా మైనింగ్ జరుగుతోందని, దానితో నాకేం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

15 నెలలుగా కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నా ఆర్ధిక పరిస్థితి బాగా లేదంటూ ఉమా తప్పించుకు తిరిగాడని, ప్రతి గ్రామంలో తాను, వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు చేతనైన సాయం చేశామని,  కానీ గొల్లపూడిలో ఐదు కోట్ల రూపాయలతో ఉమా ఇల్లు కొనుక్కున్నారని ఆరోపించారు. మైనింగ్ తో పాటు మైలవరం నియోజక అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, జైలు నుంచి బైటికి వచ్చిన తర్వాత ఉమా చర్చకు రావాలని వసంత సవాల్ విసిరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్