We both one: వచ్చే ఎన్నికల్లో బిజెపి-జనసేన కలిసే పోటీ చేస్తాయని, ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. భీమవరంలో జరిగిన మోడీ సభకు హాజరు కావాలని జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారని సోము గుర్తు చేశారు. పార్టీపరంగా వారి కార్యక్రమాలు వారు చేస్తారని, తమ కార్యక్రమాలు తాము చేస్తామని ఎన్నికల సమయంలో కలిసి పోటీకి దిగుతామని వెల్లడించారు. భారతీయ జనతా యువమోర్చా ఏపీ శాఖ ఆగస్టు 2నుంచి 15 వరకూ యువ సంఘర్షణ యాత్ర చేపట్టనుంది. ఈ యాత్ర పోస్టర్ ను విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోము వీర్రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోము మీడియాతో మాట్లాడారు. నిన్నటి భీమవరం సభను రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి తమ పార్టీ ఆలోచన అని, సమాజంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగడమే మోడీ ప్రభుత్వ విధానమని చెప్పారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో సిఎం జగన్ మాట తప్పారని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, గత ఎనికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పార్ట్ టైమ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సోము డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యువమోర్చా చేపడుతోన్న ఈ యాత్ర రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగుతుందని వెల్లడించారు. ఆగస్టు 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
Also Read : 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు: సోము