Vellampalli to Vangaveeti: చంద్రబాబు ఉచ్చులో పడొద్దని వంగవీటి రాధాకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సలహా ఇచ్చారు. రాధా కార్యాలయం మెయిన్ రోడ్డు మీదే ఉంటుందని, అక్కడ కారు తిరిగితే రెక్కీ ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు. రాధా దగ్గర ఆధారాలుంటే వాటిని బైట పెట్టాలని సూచించారు. రెక్కీ చేసిన వారెవరో తెలిస్తే వారి వివరాలు, ఆయనకు ఎవరిపైనా అయినా అనుమానం ఉంటే ఆ విషయం కూడా చెప్పాలన్నారు. హత్య- రెక్కీ అన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి గన్ మెన్ ను పంపితే తిప్పి పంపారని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.
2,250 నుండి 2,500రూపాయలకు పెంచిన పెన్షన్ లను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో లబ్దిదారులకు మేయర్ భాగ్యలక్ష్మి తో కలిసి పంపిణీ చేశారు. లబ్ధిదారుల నివాసం వద్దకు స్వయంగా వెళ్ళి అందజేశారు, ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు చెప్పినట్లు చేయవద్దని, ఇప్పటికే రాజకీయాల్లో వంగవీటి రాధాను జనం చాలావరకూ మర్చి పోయారని, ఇలాంటి పనులు చేస్తే ఇంకా నష్టపోవాల్సి వస్తుందని వెల్లంపల్లి హితవు పలికారు. డిసెంబర్ 26న ఈ విషయం బైటపడితే అదేరోజు సిఎం జగన్ స్పందించారని, చంద్రబాబు వారం రోజుల తర్వాత పరామర్శకు వచ్చారని ఎద్దేవా చేశారు. రాధాతో తెలుగుదేశం పార్టీయే డ్రామా చేయిస్తోందని వెల్లంపల్లి అనుమానం వ్యక్తం చేశారు.