సిఎం జగన్ పై పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆడియో ఫంక్షన్ వేదికను రాజకీయాలకు వాడుకోవడం సబబు కాదన్నారు. వినోదం పేరుతొ చేస్తున్న దోపిడీని అడ్డుకుంటుంటే పవన్ కు ఎందుకంత ఆక్రోశం వస్తుందో అర్ధం కావడం లేదన్నారు. జనాల జేబులు కొల్లగోడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని వెల్లంపల్లి ప్రశ్నించారు.
పవన్ కళ్యాన్ ట్యాక్స్ ఎగ్గొట్టి ఆ డబ్బులను ఎన్నికల్లో అవసరాలకు వాడుకుంటున్నారని అయన ఆరోపించారు, రేమ్యునరేషన్ల పేరుతో కోట్లకు కోట్లు దోచుకోవాలని చూస్తున్నారని, బ్లాక్ టిక్కెట్లు, మిడ్ నైట్ షోలు, బెనిఫిట్ షోల పేరుతో చేస్తున్న దోపిడీని ప్రభుత్వం నిలువరిస్తుంటే దాన్ని విమర్శించడం ఏమిటని నిలదీశారు. పేద ప్రజలు వినోదం కోసం సినిమా చూడాలనుకుంటే వారిని దోచుకుంటామంటే ప్రభుత్వం ఎలా ఊరుకుంటుందని అడిగారు.
పవన్ ను పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి, మంత్రులకు లేదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను పవన్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై మాట్లాడేటప్పుడు పద్దతిగా మాట్లాడాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని వెల్లంపల్లి హెచ్చరించారు.