ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటిస్తే అది ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు పండుగే. బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్‌కు టాలీవుడ్లో ఉన్న క్రేజ్‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ పట్టేసింది. బాహుబలి భళ్లాల దేవ రానా దగ్గుబాటి, అతని బాబాయ్ విక్టరీ వెంకటేష్ దగ్గుబాటిలతో ‘రానా నాయుడు’ అనే డ్రామా సిరీస్‌ను తెరకెక్కించేందుకు సిద్దమైంది నెట్ ఫ్లిక్స్. లోకోమోటివ్ గ్లోబర్ ఇంక్ అనే సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అమెరికన్ పాపులర్ డ్రామా ‘రే డోనోవన్’ షో టైం నుంచి కాన్సెప్టును తీసుకున్నారు. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
ఈ యాక్షన్ డ్రామాలో రానా నాయుడు జీవిత కథ ఉండబోతోంది. బాలీవుడ్లో ప్రముఖులకు వచ్చిన సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా కనిపించబోతోన్నారు. ఈ ప్రాజెక్ట్ హక్కులను వయకాయ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రీబ్యూషన్ గ్రూప్ సొంతం చేసుకుంది. కరన్ అన్షుమాన్ షో-రన్నర్ గా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. సుపర్న్ వర్న కో డైరెక్టర్‌గా పని చేయనున్నారు.
ఈ సిరీస్ గురించి రానా దగ్గుబాటి మాట్లాడుతూ “ఇది నాకెంతో ప్రత్యేకం. చిన్నాన్నతో కలిసి మొట్టమొదటి సారిగా నటించడం, అది కూడా నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది మా కెరీర్లోనే ఎంతో భిన్నమైన ప్రాజెక్ట్. ఇటువంటివి మేం ఎప్పుడూ చేయలేదు. ఇది ఎంతో అద్భుతంగా ఉండబోతోందని నాకు తెలుస్తోంది. ఇందులో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది సవాల్‌తో కూడుకున్నది అయినా కూడా ఎంతో సరదాగా ఉండోబోతోందనే నమ్మకం ఉంది. సెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు.
వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ “రానాతో కలిసి పని చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇక మేం ఇద్దరం కలిసి తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాం. ఇది మాకు పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. నేను రాయ్ డోనోవన్‌కు వీరాభిమానిని. ఈ ప్రాజెక్టుకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను” అని అన్నారు.