Saturday, January 18, 2025
Homeసినిమాతెలుగు తెరపై మళ్లీ మొదలైన గ్రాఫిక్స్ గారడీ! 

తెలుగు తెరపై మళ్లీ మొదలైన గ్రాఫిక్స్ గారడీ! 

ఒకప్పుడు తెలుగులో జానపద చిత్రాలు తమ జోరును కొనసాగించాయి. ఆ సినిమాలకు విశేషమైన ఆదరణ లభించేది. అందుకు కారణం .. నిజ జీవితంలో సాధ్యంకాని కార్యాలు తెరపై నిజమవుతూ ఉండటమే. దైవశక్తి .. దుష్టశక్తి మధ్య పోరాటాన్ని చూపించే దృశ్యాలకు ఆడియన్స్ నుంచి క్లాప్స్ పడేవి. పుష్పక విమానాలపై .. గరుడ పక్షిపై .. కీలు గుర్రంపై ప్రయాణాలు అప్పటి ప్రేక్షకులకు ఒక చిత్రమైన అనుభవాన్ని .. అనుభూతిని కలిగించాయి. అప్పట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో ప్రయోగాలు చేశారు.

ఆ తరువాత కాలంలో అమ్మోరు .. అంజి .. దేవీపుత్రుడు ..  అరుంధతి సినిమాల సమయంలో తెలుగు కథల్లోకి మళ్లీ గ్రాఫిక్స్ అడుగుపెట్టాయి. ఆ సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ, విపరీతమైన ఖర్చు .. సమయాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన ఆ తరహా సినిమాలు ఎక్కువగా రాలేకపోయాయి. ‘బాహుబలి’ తెలుగు సినిమా ప్రయాణాన్ని మార్చేసింది. తెరపై ఈ సినిమా అద్భుతాలను ఆవిష్కరించింది. ఈ  సినిమాతో గ్రాఫిక్స్ కి సంబంధించిన అంతర్జాతీయ సంస్థలు కూడా సౌత్ సినిమాలకు అందుబాటులోకి వచ్చాయి.

ఆ మధ్య వచ్చిన ‘కార్తికేయ 2’ .. ఇటీవల వచ్చిన ‘హను మాన్’  సక్సెస్ ను సాధించడంలో గ్రాఫిక్స్ ప్రధానమైన పాత్రను పోషించాయి. సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిని సొంతం చేసుకోవడంతో, మేకర్స్ ఖర్చుకు వెనుకాడని పరిస్థితి వచ్చింది. కోలీవుడ్ లో సూర్య చేస్తున్న ‘కంగవ’ గ్రాఫిక్స్ ప్రధానంగా నడిచే సినిమానే. ఇక చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’ కూడా వీఎఫ్ ఎక్స్ ప్రధానంగా నిర్మితమవుతున్నదే. భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులు గ్రాఫిక్స్ కి సంబంధించిన కంటెంట్ తో కదిలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్