హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అయోధ్య రామ మందిర నిర్మాణం దగ్గర చేయాలనేది కృష్ణంరాజు గారి కోరికగా ఉండేదని ఆయన సతీమణి శ్రీమతి శ్యామలా దేవి అన్నారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే దివికేగారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విజయదశమి సందర్భంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించే వేడుకకు కృష్ణంరాజుతోపాటు ప్రభాస్ ను కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆహ్వానించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ (VHP) రాష్ట్ర నాయకులు నేడు కృష్ణం రాజు నివాసానికి వెళ్ళి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కృష్ణంరాజు భార్య, పిల్లలను పరామర్శించారు. భారతీయ జనతా పార్టీకి, హిందుత్వానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక సినీ హీరో అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారని శ్యామలాదేవి VHP నేతలతో అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కాకినాడ, నర్సాపూర్ తో పాటు ఉభయగోదావరి జిల్లాలకు ఎనలేని సేవ చేశారని.. పల్లె పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పించారని ఆమె వివరించారు. ఈనెల 26వ తేదీన తమ స్వగ్రామం మొగల్తూరులో సంస్మరణ సభ నిర్వహిస్తామన్నారు. లక్షలాదిగా తరలివచ్చే అభిమానులు..బిజెపి కార్యకర్తల కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణం రాజు గారి కూతుళ్లకు, శ్రీమతికి విశ్వహిందూ పరిషత్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఆ కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలని కోరుకుంది. కృష్ణం రాజు గారి ఆశయాలు సాధించేందుకు పనిచేయాలని సూచించింది. VHP రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరి నాథ్, రాష్ట ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజక్ శివ రాములు, సిరివెన్నెల సాయి తదితరులు కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.
Also Read : 2023 సంక్రాంతికి రానున్న ‘ఆది పురుష్’