ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు సక్సెస్ లేక నానా తంటాలు పడుతున్నారు. ఏ కథను ఒప్పుకోవాలో .. ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. అసలు ట్రెండ్ అంటే ఏమిటి? దానిని పట్టుకోవడం ఎట్లా? అనే విషయంలో కూడా కొంతమంది హీరోలు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి ఇప్పుడు ఇదే పరిస్థితి నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు వీకెండ్ తరువాత థియేటర్లలో మాయమవుతున్నాయి .. చిన్న హీరోల సినిమాలు కొత్త రికార్డులను సెట్ చేస్తున్నాయి.
అయితే కొంతమంది హీరోల కెరియర్ ను కొన్ని ఫ్లాపులు ప్రభావితం చేయలేవు. ఎందుకంటే అప్పటికి వాళ్లకి వచ్చేసిన క్రేజ్ కాపాడుతూ ఉంటుంది. వాళ్ల పరాజయాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఆ తరువాత సినిమా ఏంటి? అనే విషయంలోనే ఆసక్తిని చూపిస్తూ వెళతారు. ఇంతవరకూ విజయ్ దేవరకొండ విషయంలో ఇదే జరుగుతూ వచ్చింది. 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ తరువాత ఆయన నుంచి మరో హిట్ రాలేదు. అప్పటి నుంచే ఆయన కెరియర్ స్పీడ్ కాస్త తగ్గిందని చెప్పాలి.
‘డియర్ కామ్రేడ్’ .. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాలు సక్సెస్ కి దూరంగానే ఉండిపోయినా, కోవిడ్ కారణంగా ప్రేక్షకులు పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన ‘లైగర్’ ను ఫ్రెష్ గానే చూశారు. అయితే అంతకుముందు సినిమాలకంటే ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చేసిన ‘ఖుషి’ కూడా అభిమానులను నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండకి సక్సెస్ అనేది అత్యవసరం అయిపోయింది. తప్పకుండా హిట్ పడాలనే ఉద్దేశంతో వెయిట్ చేసే హీరోల జాబితాలో ఇప్పుడు ఆయన కూడా చేరిపోయాడు.