తెలంగాణ విజయ డెయిరీ ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ప్రకటించారు. గురువారం NTR పార్క్, లుంబినీ పార్క్ లలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్ క్రీమ్ పార్లర్ లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, MLC బస్వరాజు సారయ్య, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధార్ సిన్హా, HMDA OSD సంతోష్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో ఆదరణ ఉందని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయ డెయిరీ నిరాదరణకు గురై, మూసివేసే పరిస్ధితికి చేరుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో చేపట్టిన పలు కార్యక్రమాలతో విజయ డెయిరీ లాభాల బాట పట్టి నేడు 750 కోట్ల టర్నోవర్ కు చేరుకుందన్నారు.
అన్ని రకాల విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి ఔట్ లెట్ ల సంఖ్య 64 ఉండగా, నేడు 650 కి పెంచడం జరిగిందన్నారు. రానున్న రోజులలో వెయ్యి వరకు ఔట్ లెట్ లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రణాలికతో ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. ప్రధాన పర్యాటక కేంద్రాలు, దేవాలయాలు, హై వే లు తదితర ప్రాంతాలలో ఈ ఔట్ లెట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ల పై కూడా పార్లర్ లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాల విక్రయ కేంద్రాలు వెయ్యి ఉండగా, నేడు 1500 వరకు పెరిగినట్లు తెలిపారు. అంతేకాకుండా 50 శాతం సబ్సిడీ పై ఐస్ కరీం పుష్ కార్ట్ లను అందజేస్తున్నట్లు చెప్పారు. విజయ డెయిరీ ఏర్పాటు చేసే ఔట్ లెట్ లు, పుష్ కార్ట్ ల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టళ్ళ లో కూడా విజయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి అనుబంధంగా పాడిరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అందులో భాగంగా విజయ డెయిరీ కి పాలు పోసే రైతులకు సబ్సిడీ పై పాడి గేదెల పంపిణీ, లీటర్ పాలకు 4 రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీ పై దాణా, గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల పాల సేకరణ ధరను లీటర్ కు 5 రూపాయలు పెంచడం వలన 50 వేల లీటర్ల పాలు అదనంగా విజయ డెయిరీ కి వస్తున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా లో 250 కోట్ల రూపాయల వ్యయంతో 5 లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన అత్యాధునిక మెగా డెయిరీ నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. పోటీ మార్కెట్ లో అనేక ఇబ్బందులను అధిగమించి తెలంగాణా విజయ డెయిరీ ఎంతో అభివృద్ధి లోకి వచ్చిందని, డెయిరీ లోని అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరి కృషి తోనే ఇది సాధ్యమైందని మంత్రి అభినందించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరిగే విధంగా ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. విజయ డెయిరీ, పశుసంవర్ధక శాఖ, TSLDA అధికారులు, గోపాలమిత్రల సమన్వయంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజూ లక్షలాది లీటర్ల పాలను గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల నుండి కొనుగోలు చేస్తున్నామని, మన రాష్ట్రంలోనే గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున పాల ఉత్పత్తి జరిగే విధంగా ప్రజాప్రతినిధులు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీ, పాడి రంగం అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.
Also Read : విజయ డైరీ రైతులకు శుభవార్త