గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే ఏ చర్యనైనా తాము సమర్దిస్తామని, వారి అభ్యున్నతికి తాము, తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీనేత వి. విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్ ట్రైబ్స్ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్య సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
పాడేరులో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని, అక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రికగ్నేషన్గ్గ్న అఫ్ ఫారెస్ట్ రైట్స్, పట్టాల పంపిణీ, పోడు వ్యవసాయం ద్వారా రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. 55,513 పట్టాల ద్వారా 1,30,679 ఎకరాలు పంపిణీ చేశామని వివరించారు.
దేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(b) కింద జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పిస్తున్నామని, కొన్ని ఉప కులాలను అందులో చేర్చినా ఎలాంటి ఇబ్బందీ లేదని, పెరిగిన జనాభా వారి నిష్పత్తి ప్రకారం వారి కోటా కూడా పెరుగుతుందని, ప్రస్తుతం రిజర్వేషన్ పొందుతున్నవారికి ఎలాంటి అన్యాయం జరగబోదని అభిప్రాయపడ్డారు.
బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, దాన్ని పరిగణన లోకి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం 7శాతం రిజర్వేషన్ ఎస్టీలకు ఉందని, కొత్తగా కొన్ని సబ్ కులాలను చేర్చడం ద్వారా అది 8 లేదా 9 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు.