ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ) డా. కె. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్ళారు. ఆయన స్థానంలో కె.విజయానంద్ ను నియమించనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జవహర్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. అయితే జగన్ హయంలో సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహంగా ఉంది. విశాఖలో ఆయన తనయుడి పేరిట భూములు దోచుకున్నారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి.
తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన జవహర్ రెడ్డి పట్ల చంద్రబాబు ముభావంగా వ్యవహరించారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఏదో చెప్పాలని భావించినా బాబు దాన్ని వినేందుకు ఇష్టపడలేదు. సెలవుపై వెళితే మంచిదని టిడిపి నాయకత్వం పరోక్షంగా సిఎస్ కు సూచించింది. దీనితో ఆయన కొద్దిసేపటి క్రితం వ్యక్తిగత కారణాలతో సెలవుకు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని వెంటనే ఆమోదించి సాయంత్రానికి విజయానంద్ కు ఈ బాధ్యతలు అప్పజెప్పనున్నారు.
బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా, ఏపీ ట్రాన్స్ కో , ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
మరోవైపు ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ కూడా అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్ళారు. సిఐడి చీఫ్ సంజయ్ ఇప్పటికే సెలవులో ఉన్నారు.
కాబోయే సిఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఆయన నివాసానికి చేరుకున్న ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి లకు అనుమతి నిరాకరించారు. దీనితో వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు.