Tuesday, March 10, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్స్టీల్‌ ప్లాంట్‌ అమ్మొద్దు: కేంద్రమంత్రికి వినతి

స్టీల్‌ ప్లాంట్‌ అమ్మొద్దు: కేంద్రమంత్రికి వినతి

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచన ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ జరిపారు.

అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని విజయసాయి గుర్తు చేశారు. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిదని పేర్కొన్నారు. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయని, స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు.

ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్జిజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని వివరించారు. అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని అన్నారు.

కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోందని, ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుంది. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని ఆర్థిక మంత్రికి ఆయన సమర్పించిన వినతి పత్రంలో వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular