ఆంధ్రప్రదేశ్ పాలిట విలన్ కాంగ్రెస్ అని, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ పై విజయసాయి నిప్పులుచెరిగారు. ఆ పార్టీ వల్ల ఏపీకి కోలుకోలేని నష్టం కలిగిందని, వారి దుష్పరిపాలనకు ఏపీ బాధిత రాష్ట్రమని అభివర్ణించారు.
పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారని కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారని, ఏపీ ప్రజల మనోభావాలను ఆ పార్టీ ఎన్నడూ గౌరవించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, పదేళ్ల తరువాత చిట్టచివరి అస్త్రంగా…ఎన్నికల నోటిఫికేషన్‌కు పదిరోజుల ముందు రాష్ట్రాన్ని విభజించారని, ఎన్నికల్లో లాభం పొందాలన్న రాజకీయ కోణంలోనే ఈ ప్రక్రియ చేపట్టారని ఫైర్ అయ్యారు.
విభజన తరువాత ఏనాడు హోదా గురించి కాంగ్రెస్ మాట్లాడలేదని, ఏపీపై చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే హోదా అంశాన్ని ఎందుకు పెట్టలేదని నిలదీశారు. కావాలనే దీన్ని విస్మరించారన్నారు. చట్టంలో చేర్చడం చేతగాని కాంగ్రెస్ఇ ప్పుడు తమను విమర్శిస్తోందని ఈ అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కేంద్రాన్ని అనేక సార్లు విజ్ఞప్తి చేశారన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైందని, వచ్చే ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలోనూ కనుమరుగవడం ఖాయమని అన్నారు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ తథ్యమన్నారు. మిత్రపక్షాలే కాంగ్రెస్‌ను నమ్మడం లేదని అంటూ…. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ 40 సీట్ల కంటే తక్కువుగా గెలుస్తుందని మమతా బెనర్జీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో అమేథీలో ఓటమి పాలైన రాహూల్ గాంధీ 2024లో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓటమి ఖాయమని అన్నారు. కాంగ్రెస్ లేకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఆ పార్టీ ఉన్నంత కాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందన్నారు.