Saturday, January 18, 2025
HomeTrending Newsలోకేష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: విజయసాయి

లోకేష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: విజయసాయి

నెల్లూరు జిల్లాను నేర రాజధాని అంటూ టిడిపి నేత నారా లోకేష్  చేసిన వ్యాఖ్యలపై  వైఎస్సార్సీపీ  పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి తప్పు బట్టారు. ఒక సంఘటన ఆధారంగా మొత్తం జిల్లాను ఈ విధంగా పేర్కొనడం సరికాదని చెప్పారు.  లోకేష్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని,  సంస్కార లేమిని సూచిస్తున్నాయని అన్నారు.  వివిధ సంఘటనలపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్న విజయసాయి లోకేష్ తన నెల్లూరు పర్యటనలో చేసిన కామెంట్లపై స్పందించారు.

“ఏ రాష్ట్రంలోనైనా అనేక చోట్ల అవాంఛనీయ సంఘటలు జరుగుతూ ఉంటాయి. ఏ ఒక్క కుటుంబానికీ హాని జరగకూడదని, ఏ ఒక్కరి ప్రాణం పోకూడదని ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకపక్షంతోపాటు ప్రతిపక్షాలూ కోరుకుంటాయి. నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర ఘటనతో అందరి దృష్టినీ ఈ ప్రాంతం ఆకర్షించింది. ఈ సందర్భంగా పరామర్శకు వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్‌ రాజకీయ నాయకుడిలా ప్రసంగించాడు. పాలకపక్షంపై ఆరోపణలు సంధించాడు. రాజకీయ పార్టీ నేత రాజకీయాలే మాట్లాడడం సహజమే కదా, అని కొందరు అంటారు. సరే, అలాగే అనుకుందాం. లోకేష్‌ అంతటితో ఆగలేదు. సందర్భం మరిచాడు. ప్రత్యర్ధి పార్టీ నాయకులపై నిప్పులుకక్కే క్రమంలో చినబాబు నెల్లూరు జిల్లాపై అసభ్య రీతిలో మాట్లాడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది”.

“ ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం నేతలు నెల్లూరు జిల్లాను రాష్ట్రానికి నేర రాజధానిగా మార్చారని లోకేష్‌ విమర్శించి ఒక్క నెల్లూరు జిల్లా ప్రజలనేగాక తెలుగువారందరినీ అవమానించారు. ఈరోజుల్లో ఏ ప్రాంతంలోనైనా గొడవలు, ఘర్షణలు జరిగే పరిస్థితులను నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం, పాలకపక్షం ప్రయత్నిస్తున్నా అప్పుడప్పుడూ అలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో కొన్ని సమయాల్లో నేరాలు ఎక్కువ జరగే అవకాశాలుంటాయి. అంతమాత్రాన నెల్లూరు వంటి తెలుగు విశాల సమాజానికి బాగా తెలిసిన జిల్లా మొత్తాన్ని రాష్ట్రానికి నేర రాజధాని అయిందని ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా పేరు మోసిన లోకేష్‌ మాట్లాడడం దారుణం. ఆయన తల్లిదండ్రులకు చిత్తూరు, కృష్ణా జిల్లాలు, చెన్నై నగరాల్లో మూలాలున్నాయి. తాను స్వయంగా హైదరాబాద్‌ మహానగరంలో పుట్టి పెరిగాడు. అవకాశాల స్వర్గం అమెరికాలో లోకేష్‌ యూజీ, పీజీ చదువుకున్నాడు. ఏపీ మంత్రిగా రెండేళ్లు వెలగబెట్టాడు. ఇంత ఘనమైన కుటుంబ, సామాజిక, రాజకీయ నేపథ్యం ఉండి కూడా– అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందిన నెల్లూరు జిల్లాను కేవలం ఒక సంఘటన ఆధారంగా ‘నేర రాజధాని’ అని ముద్రవేయడం లోకేష్ అనాగరిక ప్రవృత్తికి నిదర్శనంగా కనిపిస్తోంది” అంటూ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్