Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవింటే పురాణం వినాలి...తింటే గారెలే తినాలి

వింటే పురాణం వినాలి…తింటే గారెలే తినాలి

Great Host: బఫే భిక్షం పేరిట గత వారం ఒక వ్యాసం రాశాను. ఆ ఐ ధాత్రి లింక్ ఇది. దానికి విరుగుడుగా ప్రేమాభిమానాలతో కొసరి కొసరి తినిపించిన ఒక ఊరి పెద్ద గురించిన కథనమిది.

అడుక్కుతినే వేదాంతం

విజయవాడ ఘంటసాల సంగీత నృత్య కళాశాల మైదానంలో కొన్నిరోజులపాటు సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు జరుగుతున్నాయి. ఒక సాయంత్రం ఆ ప్రవచనానికి నలుగురు సాహితీ మిత్రులం వెళ్లాము. నేను తప్ప మిగతా ముగ్గురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు. కార్యక్రమం అయ్యాక విజయవాడ మాజీ మేయరు జంధ్యాల శంకర్ గారితో కలిసి వారింటికి వెళ్లాము. వారింటి డాబా మీదే సామవేదం గారి బస.

మా నలుగురిలో ఒకరు తప్ప మిగతా ముగ్గురు అంతకుముందు ఆయనకు పరిచయం లేనివారు. అనుకోని అతిథులం. రాత్రి తొమ్మిది సమయం. లైట్ గా ఆవడలు…అని మొదలు పెట్టి పులిహోర, వడలు అల్లం పచ్చడి, ఆవడలను నాలుగు ప్లేట్లలో పెట్టుకుని 87 ఏళ్ల పెద్దాయన నవ్వుతూ వంటింట్లో నుండి తీసుకొచ్చారు. మంచి నీళ్ల గాజు గ్లాసులు కూడా ఆయనే తెస్తుంటే ఆయన వయసులో సగమున్న మేము లేచి వెళ్లి అందుకోబోయాము. నో ఇట్స్ ఓకే. నాకు అలవాటే అన్నారు. కొసరి కొసరి తినిపించారు. టిష్యు పేపర్లు తీసుకొచ్చి ఇచ్చారు. చేతులు కడుక్కోవడానికి లేస్తే వాష్ బేసిన్ దాకా వచ్చారు. అంతకుముందు ప్రవచనం దగ్గర నుండి ఆయనే కారు డ్రయివ్ చేసుకుంటూ వచ్చారు. యాభై, అరవై ఏళ్లుగా లోకం చుట్టిన అనుభవాలను తేదీలతో పాటు ఆయన ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెబుతుంటే...ఆయన వయసుకు ఎలా ఉంటామో అని మా నలుగురు స్వగతంలో స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చాము.

నేను పద్యాలు చెప్పాను. ఆయన భళీ అన్నారు. విప్పగుంట తను రాసిన కవిత్వం పుస్తకం ఇస్తే…సంతకం చేసి ఇవ్వాలని సంతకం చేయించుకున్నారు. విశ్వనాథ పావనీ శాస్త్రి అల్లుడు మార్కండేయకు పావని గురించి, విశ్వనాథ వారి గురించి చెప్పారు. ప్రసాద రావు కదిలిస్తే అమెరికా, రష్యా, జపాన్ అనుభవాలను అయిదు నిముషాల్లో ఆవిష్కరించారు. విజయవాడలో జర్నలిస్టుగా పనిచేసిన మా మామ కూచి గోపాలకృష్ణతో సాన్నిహిత్యం గురించి చెప్పారు.

Jandhyala Shankars

కాళిదాసుకంటే గొప్పవాళ్ళమయినట్లు మా గురించి చెప్పారు. అలా చెప్పినప్పుడు నటించాలి కాబట్టి కొన్ని ఆధ్యాత్మిక, సాహిత్య విషయాలను సామవేదం వారి ముందు చెప్పే సాహసానికి ఒడిగట్టాము. అయితే పండిత పుత్రులం అని మొదటే డిస్ క్లైమర్ ను విన్నవించుకున్నాం కాబట్టి ఆయన ఓపికగా మమ్మల్ను భరించి ఆశీర్వదించారు.

గేటుదాకా వచ్చి మాకు వీడ్కోలు చెబుతూ మళ్లీ కలుద్దాం అన్నారు జంధ్యాల. ఇలా కాకుండా అరేంజ్డ్ గా డాబా మీద ఆరుబయట రాత్రి భోజనానికి…అన్నారు. అనుకోకుండా వెళితేనే ఇలా ఉంది…ఆయన పిలిచి పెడితే కడుపులో చోటు చాలదు…అని ప్రసాద రావు స్వానుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తొమ్మిది పదుల వయసుకు చేరువలో ఉన్న ఆయన చేతి ముద్దలో అమృతం ఉన్నమాట నిజమే కానీ…చేతులు కడుక్కోవడానికి చోటు చూపుతూ వెంట వచ్చే ఆయన అతిథి మర్యాదలకు మాత్రం పాదనమస్కారం చేయాల్సిందే. మా తరుపున విప్పగుంట పాదనమస్కారం చేశారు. మా అజ్ఞానాన్ని నవ్వుతూ భరించి ఆశీర్వదించినందుకు సామవేదంగారికి పాదనమస్కారం చేసి బయలుదేరాము.

ఆ సాయంత్రం దత్తాత్రేయ ప్రవచనం. ఆ రాత్రి జంధ్యాల గారి అతిథి మర్యాదలు.
రేపటికి దాచుకోవడానికి సామవేదం గారి అభినందనలు. అన్నీ గుర్తుంచుకోదగ్గవే.
వింటే పురాణం వినాలి…తింటే గారెలే తినాలి అని సామెత. సామవేదం గారి పురాణం విన్నాము. జంధ్యాల గారింట్లో గారెలు తిన్నాము.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్