Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసంక్షోభంలో సంపద పాఠం

సంక్షోభంలో సంపద పాఠం

Carona Crises: పిల్ల జెల్ల ఇంటికాడ ఎట్ల ఉన్రో ?
నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో?

పూట పూట జేసుకోని బతికేటోళ్లం
పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్లం

దేశమేమో పెద్దదాయె
మా బతుకులేమో చిన్నవాయె
మాయదారి రోగమొచ్చి మా బతుకుమీద మన్నుబోసె

ఏమి బతుకు? ఏమి బతుకు?
చెడ్డ బతుకు
చెడ్డ బతుకు
చెడ్డ బతుకు
చెడ్డ బతుకు
చెడ్డ బతుకు

పేద రోగంకంటే పెద్దరోగముందా?
అయినవాళ్ళకంటే అండ ఉందా?

కష్టకాలం ఇంటికాడ ఉంటె సారూ!
కలిసి మెలిసి కలో గంజో తాగేటోళ్ళం

పిల్లగాన్లు కన్నులల్లో విడవకుండా మెదలబట్టే
ఇంటిదాని దుఃఖమేమో ఆగకుండా తరమబట్టే
ఏమి జేతు ?
ఏమి జేతు ?
ఏమి జేతు ?
ఏమి జేతు ?
ఏమి జేతు ?

బస్సులొద్దు బండ్లు ఒద్దు అయ్య సారూ!
ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ!

ఇది అదేశ్ రవి రాసి, పాడిన విషాదగీతం.
కన్నీళ్లు పొంగించే కవిత్వం. కొన్ని కోట్లమంది వలస జీవుల మౌన వేదన. ఊరు వదిలి పొట్టచేత పట్టుకుని పరాయి ఊరికి వెళ్లిన, పరాయి దేశాలకు వెళ్లిన అందరి బాధ ఇది. పేదరికం కంటే పెద్ద రోగం ఉంటుందా?
అయినవాళ్లకంటే అండ ఉంటుందా?

కరోనా కష్టకాలంలో ఇంట్లో పిల్లలెలా ఉన్నారో ? తల్లి ఎలా ఉందో? ఏమి తింటున్నారో? ఎలా బతుకుతున్నారో? కష్టం కక్షగట్టి మీద పడ్డ వేళ మనిషిగా నేను ఇంట్లో లేకుండా ఇలా రోడ్డుమీద, ఎక్కడో ఉన్నానే? ఏమి బతుకు నాది? ఇంత చెడ్డ బతుకా నాది?

బస్సులు , బండ్లు ఏమీ వద్దు. అయ్యా సారూ!
వదిలితే వేల మైళ్ళు కాళ్లతో నడిచి ఇల్లు చేరుతాం. కలో గంజో తిని అక్కడే ఉంటాం.

ఈ పాట రచయితగా రవి ప్రయోగాలు చేయలేదు. పదబంధాలు సృష్టించలేదు. ప్రాసలు కూర్చలేదు. యతులు అల్లలేదు. గాయకుడిగా రాగాలు ఎంచుకోలేదు. స్వరజతులు, ఆరోహణ, అవరోహణలు వెతుక్కోలేదు.

కన్నీళ్లను అక్షరాల్లోకి అనువదించాడు. వలస కూలీల అంతులేని వేదనకు రాగం కట్టాడు. మంచి తెలంగాణా మాండలికంలో కోట్ల గుండె గొంతుక అయ్యాడు.

యూట్యూబులో పాట వినండి. మళ్లీ మళ్లీ వినండి. మీలో మనిషి మేల్కొంటాడు. మీలో మానవత్వం కంటితడిగా మీకే తెలుస్తుంది.

కరోనా మొదటి వేవ్ వేళ కోట్ల మంది వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లలేక…వెళుతూ…ఆగుతూ…పడ్డ బాధలకు రవి స్పందన ఇది. రెండో వేవ్ అయ్యింది. ఇప్పుడు మూడో వేవ్ లోకి ప్రవేశించాం. అప్పుడు సొంత ఊళ్లకు వెళ్లిన వారు ఇప్పుడు పనుల్లేక పస్తులుంటున్నారు. ఎందరు రవులు ఎన్ని విషాద గేయాలు రాసి పాడాలో ఇప్పుడు?

పాయె…కరోనా దెబ్బకు ఉన్న ఉద్యోగాలూ పాయె

ఆవు వ్యాసం, ఏడు చేపల కథ తెలియని తెలుగువారుండరు. ఆవు వ్యాసం అంత గొప్పది. ఏడు చేపలు ఎప్పటికీ ఎండవు. కరోనా ఆవు వ్యాసాన్ని తిరగరాస్తోంది. ఏడు చేపల్లో ఒక చేప ఎండకపోవడానికి కూడా కరోనానే కారణం.

కరోనా దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీల కార్యాలయాలు మూతపడ్డాయి. వలస కార్మికుల విషాదం అడుగడుగునా గుండె బరువెక్కిస్తోంది. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు కరోనా కాలంలో కన్నీళ్ళకే కన్నీళ్లు తెప్పించేంత దుర్భరంగా తయారయ్యాయి. అలాగని సంఘటిత రంగ ఉద్యోగులు, ఇతర ప్రయివేట్ వైట్ కాలర్ ఉద్యోగులు భద్రంగా ఉన్నట్లు అనుకుంటే మనం పొరబడినట్లే. సర్వీసు రంగంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కరోనా దెబ్బకు ఎన్ని ఊడిపోయాయో? అంతర్జాతీయ క్లయింట్లు ప్రస్తుత సంక్షోభ సమయంలో సర్వీసులు వద్దనుకుంటున్నారు కాబట్టి ఆఫీసులో పనేమీ లేదు. ఊరికే గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడానికి మీకు జీతాలిచ్చే ఔదార్యం మాకు లేదు. అందుకే ముందు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంగళం పాడి, ఇంకా బరువనుకుంటే పర్మనెంట్ ఉద్యోగులకు కూడా హ్యాండిస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న మీకు ఈనెల జీతం మీ అకౌంట్లో వేశాం. ఇక మీరు ఇంట్లోనే ఉండిపోండి. వచ్చేనెల నుండి ఇంటిపనులు చేసుకుంటూ కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లోనే ఉండండి. ఇక మీకు మాకు సంబంధం లేదు అని మల్టీ నేషనల్ కంపెనీలు నిర్దయగా కరోనా మొదటి వేవ్ లోనే చెప్పేశాయి.

Carona Pandemic

వలస కార్మికుడి పొట్టకొట్టింది కరోనా. ప్రయివేటు ఉద్యోగి పొట్టకొట్టింది కరోనా. ఉద్యోగం ఊడగొట్టడానికి సాకు చెప్పింది కరోనా. సంస్కరణలకు దారి చూపింది కరోనా. భక్తికి భాష్యం చెప్పింది కరోనా. సకల చరాచర జగత్తును ఆపింది కరోనా.

పేదరికానికి పేరేది? ఊరేది?
ప్రపంచ కుబేరుల్లో అగ్రగణ్యులయిన భారతీయులు, తెలుగువారు అని వార్తలు చదువుతుంటాం. మొత్తం ప్రపంచ సంపదలో సింహ భాగం కొన్ని వందల మంది చేతిలోనే బందీ అయి ఉండడం విధి విలాసం. కొందరి సంపద ఎలా క్షణ క్షణ ప్రవర్ధమానమవుతుందో? కొందరు సంపన్నులు ఏ ప్రభుత్వన్నాయినా ఎలా శాసించగలుగుతారో? అన్నది ఏ స్టాన్ఫోర్డ్ చెప్పని విద్య.

కరోనా లాక్ డౌన్లో రవాణా సౌకర్యాల్లేకపోయినా వందల, వేల కిలోమీటర్లు నడిచి వెళుతున్న మానవ మహా విషాద యాత్ర గురించి అధేశ్ రవి రాసిన పిల్ల జెల్ల ఇంటికాడ ఎట్ల ఉన్రో…కన్నీటి పాటలో పేదరికం కంటే పెద్ద రోగముందా? అని సమాధానం లేని ప్రశ్న ఉంది. అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో అని దాశరథి ప్రశ్నించి డెబ్బయ్ ఏళ్ళు దాటింది. ఇప్పటికీ ఆ నవయుగం కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు.

లెక్కపెట్టలేని సున్నాల ఆత్మ నిర్భర్ అభియాన్ లు అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతలను మరచిన దుశ్యంతుడిలా ఎంత నిబ్బరం ఇచ్చిందో తీసుకున్నవారే చెప్పాలి. శాకుంతలంలో ఉంగరం చూసిన తరువాతయినా దుశ్యంతుడికి గతం గుర్తొస్తుంది. ఆధునిక కరోనా కుంతలంలో ఉంగరాలు ఉండవు. ఉన్నా అవి సున్నాల శూన్యం కావడంవల్ల దుశ్యంతులకు గుర్తు చేయలేం. అయినా నిర్భరజ్ఞానంలో ఏమి జరిగినా నిబ్బరంగా ఉండాలన్న ఓదార్పు, అంతకుమించి నిర్భర వేదాంతం ఉండనే ఉంది.

అయినా-
పేదరికానికి పేరేది? ఊరేది?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ఈ రెండు, మూడేళ్లలో కోట్ల మంది వీధిన పడ్డారని దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు బాధ పడింది. వంద మంది ప్రపంచ అపర కుబేరుల సంపద మాత్రం కరోనా వేళ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని దావోస్ సదస్సు నిట్టూర్చింది. కేవలం కరోనా వల్ల కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదలయ్యారని దావోస్ లెక్కగట్టింది. కేవలం కరోనా కల్పించిన కొత్త కొత్త అవకాశాల వల్ల కొత్తగా కుబేరులు కూడా పుట్టుకొచ్చారని అంకెలేవో చెబుతోంది. ఈ అంకెలు ప్రపంచానివా? భారత దేశానివా? నిరుపేదల ఒకటి ముందు నిలుచునే సున్నాలు విలువ లేనివి; సంపన్నుల ఒకటి తరువాత వచ్చి కూర్చునే సున్నాలు విలువైనవి అవుతున్నప్పుడు…దావోస్ సున్నాలు దేశానివయినా, ప్రపంచానివయినా ఏడుపులో తేడా లేదు. కన్నీళ్లు ఆగేవి కావు.

Carona Pandemic

మంచుకే వణుకు పుట్టే దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక మీద అంకెలు అభివృద్ధిని పరిహసిస్తున్నాయి. సున్నాలు శూన్యాలను వెతుక్కుంటున్నాయి.
పేరు శ్రేయో రాజ్యం-
సంపద కుబేరుల భోజ్యం.

దావోస్ చెప్పిన పాఠం:-
నిరుపేదల బతుకు బూడిద కరోనా!
కుబేరుల బతుకు భాగ్యం కరోనా!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : పట్టాలెక్కని వ్యాకరణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్