Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకోహ్లీ విశ్వరూప విన్యాసం

కోహ్లీ విశ్వరూప విన్యాసం

The King:
గెలిపించినప్పుడు పొగుడుతాం.
ఓడించినప్పుడు తిడతాం.
అభిమానులుగా మనకామాత్రం హక్కు ఉండదా…ఏమిటి?

క్రీజులో ఆడుతున్నది వారే కావచ్చు.
కానీ ప్రతి బాల్ ఎలా కొట్టాలో…ఎలా కొట్టకూడదో…వారిని ఉత్సాహపరుస్తూ…ఈలలు వేస్తూ…కేరింతలు కొడుతూ…వారికి చోదకశక్తిగా ఉన్నది మనమే కదా?
మనకామాత్రం బాధ్యత ఉండదా…ఏమిటి?

నీలం డ్రస్సులో వారు వికెట్ల మధ్య పరుగులు పెడుతుంటే…వారి మధ్య మనం కూడా నిద్రాహారాలు మాని పరుగులు తీస్తున్నాం కదా!
మనకామాత్రం కన్సర్న్ ఉండదా…ఏమిటి?

Virat Kohli

టీ వీ ప్రత్యక్ష ప్రసారాల ముందు బాల్ బాల్ కు దేవుడికి మొక్కుకుని వారు కొట్టే ప్రతి షాట్ కు దైవ శక్తిని ఆవాహన చేయిస్తున్న మనకు వారి విజయంలో ఆ మాత్రం భాగం లేకుండా ఉంటుందా…ఏమిటి?

ఇండియా గెలిస్తే దేవుడున్నట్లు…లేకపోతే దేవుడు లేనట్లు అని చిన్న పిల్లలు ఎన్నో సార్లు దేవుడి ఉనికిని ప్రశ్నిస్తే…దిక్కుతోచని దేవుడు గెలిపించినప్పుడు…ఆ చిన్న పిల్లలకు గెలుపులో ఆ మాత్రం వాటా ఉండదా…ఏమిటి?

దేశంలో క్రికెట్ ఒక మతమై…అందునా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఒక యుద్ధమై…నరాలు తెగే ఉత్కంఠ అయినప్పుడు…ఈ మాత్రం మజా ఉండదా…ఏమిటి?

అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఎత్తులూ అధిరోహించిన విరాట్ కోహ్లీ…ఈమధ్య తడబడుతూ చప్పగా ఆడుతుంటే అభిమానులు డీలాపడినమాట నిజం. నీరసపడ్డ అభిమానుల్లో చురుకు పుట్టేలా, కళ్లు చెదిరేలా, ఒళ్లు పులకించేలా, తలచుకుని తలచుకుని పొంగిపోయేలా విరాట్ విశ్వరూప విన్యాసం ఉన్నప్పుడు ఈ మాత్రం ఉక్కిరి బిక్కిరి ఉండదా…ఏమిటి?

18 బాల్స్…యాభై రెండు రన్నులు కావాల్సిన వేళ…ఎదుటి బ్యాట్స్ మ్యాన్ పెవిలియన్ ముఖం పడుతున్నవేళ…గెలుపు మీద ఆశలు సన్నగిల్లిన వేళ…ఒక్కడై నిలిచి…పరుగుల సునామీ సృష్టించడం మాటలు కాదు. ఆట కాదు. అక్షరాలా మైండ్ గేమ్. అతడొక్కడే సర్వ సైన్యమై నిలిచి పోరాడి గెలవాల్సిన సందర్భం. నిజంగానే మాటలు చాలని గెలుపు. మాటలు మోయలేని ఆనందం.

టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నట్లు…
“Kohli: More calculated; more measured; more engineered; still hungry” ఆ క్షణం కోహ్లీ చాలా లెక్కలు వేసుకున్నాడు. చాలా క్రీడా ఇంజనీరింగ్ మెళకువను ప్రదర్శించాడు. ఇంకా అతడి దాహం తీరలేదు. ఇలాంటి గెలుపు తరువాత చెమర్చిన కోహ్లీ కళ్లను ఆప్యాయంగా మనం ఆ మాత్రం తుడవద్దా…ఏమిటి?

గెలుపు పులకింతలో కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీని భుజం మీద ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. అది రోహిత్ భుజం కాదు…యావత్ దేశం భుజం.

Virat Kohli

గెలుపు సంబరంలో ఉబ్బి…కుప్పి గంతులు వేసింది మెల్బోర్న్ ప్రేక్షకుల్లో సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, ఇర్ఫాన్ పఠాన్లే కాదు…ఈ దేశ ప్రజలు.

ఒక తాదాత్మ్య స్థితిలో చేతి వేలు ఆకాశంలో ఊపుతూ గాలిలో తేలింది విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు…సగటు క్రికెట్ క్రీడాభిమానులందరూ.

ఇంకా ఎంతో చెప్పాలని ఉన్నా…భాష చాలక ఆపేస్తున్నా. లవ్ యూ కోహ్లీ.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

క్రికెట్ కొలనులో కమలం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్