Friday, March 13, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కిషన్ రెడ్డితో స్వాత్మానందేంద్ర భేటి

కిషన్ రెడ్డితో స్వాత్మానందేంద్ర భేటి

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. సాంస్కృతిక, పురావస్తు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తుశాఖ షరతులు, నిబంధనలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాల అభివృద్ధికి పురావస్తుశాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాచీన నిర్మాణాలపై పురావస్తుశాఖ పర్యవేక్షణ ఎంత ముఖ్యమో, వాటి సంరక్షణకు అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని చెప్పారు. తెలంగాణలో వేయి స్తంభాల గుడి, ఆంధ్రలో పంచారామ క్షేత్రాలు పురావస్తు శాఖ నియమ నిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ, జానపద కళల పరిరక్షణకు విశేషంగా కృషి చేయాలని స్వాత్మానందేంద్ర కోరారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఈనెల 24వ తేదీ నుంచి చేపట్టనున్న చాతుర్మాస్య దీక్ష గురించి వివరించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు కిషన్ రెడ్డి దంపతులకు ఉండాలని ఆకాంక్షించారు. ఆదిశంకరాచార్య ప్రతిమను బహుకరించి పీఠం దుశ్శాలువతో కిషన్ రెడ్డి దంపతులను సత్కరించారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. తన అధికారిక నివాసానికి విచ్చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిని దగ్గరుండి వీడ్కోలు పలికారు కిషన్ రెడ్డి దంపతులు.
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular