మొదటి నుంచి కూడా విశాల్ తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. మాస్ యాక్షన్ హీరోగా ఆయనకి తమిళనాట మంచి క్రేజ్ ఉంది. విశాల్ సినిమా అనగానే అది ఎలా ఉంటుందనే ఒక ఐడియాకి ఆడియన్స్ వచ్చేస్తారు. అలాంటి ఒక ముద్ర ఆయన వేయగలిగాడు. తమిళంలో మాస్ ఇమేజ్ ఉన్న హీరోలే ఎక్కువ. అయినా విశాల్ తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వెళ్లడం గొప్ప విషయమనే చెప్పాలి. అలా ఆ జోనర్ లో వచ్చిన మరో సినిమానే ‘రత్నం’.
హరి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్ననే తమిళ .. తెలుగు భాషల్లో థియేటర్లలో దిగిపోయింది. నిజానికి టాలీవుడ్ నుంచి పెద్దగా సినిమాలు లేని సమయంలో ‘రత్నం’ రంగంలోకి దిగిపోయింది. ఒక రాజకీయనాయకుడి దగ్గర ప్రధానమైన అనుచరుడిగా పనిచే రత్నం, అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటాడు. అలాంటి రత్నం కొంతమంది రౌడీల బారి నుంచి హీరోయిన్ ను కాపాడబోయి, వాళ్ల అసలు టార్గెట్ తాను అవుతాడు. ఆ తరువాత అతనికి ఎదురయ్యే సంఘటనలే ఈ సినిమా.
విశాల్ సినిమా .. పైగా దర్శకుడు హరి .. అందువలన యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఈ సినిమాలో విశాల్ ఫైట్లతో హోరెత్తించాడు .. యాక్షన్ ఎపిసోడ్స్ లో తన మార్క్ చూపించాడు. ఇది కామనే కదా .. మరి కథ .. కథనాల మాటేమిటి? అంటే, ఆ రెండూ చాలా బలహీనంగానే కనిపిస్తాయి .. నీరసంగా నడుస్తాయి. యాక్షన్ కి కారణమైన ఎమోషన్ అక్కడక్కడ మాత్రమే కనెక్ట్ అవుతూ .. వదిలేస్తూ వెళుతూ ఉంటుంది. దేవిశ్రీ సంగీతం ఫరవాలేదు. విశాల్ నుంచి వచ్చిన రొటీన్ సినిమాగానే దీనిని చూడొచ్చు .. కొత్తదనం లేని కంటెంట్ గానే చెప్పుకోవచ్చు.