పద్యం:-
“చరణాగ్రమున నీ భుజాదర్పమణచిన ధూర్జటి విలు తుంచివైచె వాలపాశమ్మున నిన్ను కట్టిన వాలిని ఒకమ్మున కులవైచె అని నిన్ను పురుగొన్న అర్జును బలిగొన్న పరశురాముని యాజి భంగపరిచె కలిమియైయొక్కటి పదునాల్గువేవుల బారిసమరె అట్టి మహా ధనుర్ధరునకున్ యెగ్గాచరించి, హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయద, నిర్ఘాత, సంఘాత, బాణ ఘాత శాత హతులుగాక బదుకగలరె?”
భావం:-
ఓ రావణాసురా! నువ్ కైలాసాన్ని పెకలించబోయినప్పుడు శివుడు కాలిని అదిమి పట్టి నీ గర్వాన్ని అణచాడే…ఆ శివుడి విల్లును రాముడు అవలీలగా తుంచివేశాడు. నిన్ను తోకతో చుట్టి నాలుగు సముద్రాల్లో ముంచి తేల్చాడే…ఆ వాలిని రాముడు ఒక్క వేటుతో నేలపడగొట్టాడు. నిన్ను ముప్పుతిప్పలు పెట్టిన కార్తవీర్యార్జునుడిని నిగ్రహించిన పరశురాముడిని రాముడు నిగ్రహించాడు. ఖరదూషణాదులు పద్నాలుగు వేలమందిని రాముడు పద్నాలుగు నిమిషాల్లో మట్టుబెట్టాడు. అలాంటి రాముడు బాణం సంధిస్తే…దానికి హరిహర బ్రహ్మలయినా ఎదురు నిలవగలరా?
పద్యం:-
“మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు అబ్జాగర్భాండము
నిండ రామ వసుధాధిపుడేసెడు వజ్రసాధనాఖండిత
పంక్తి కంఠ ఘన కంఠ పురాంతక శైల చాలనోద్దండ
బలప్రచండ పురదండ విఖండన చండ కాండముల్”
భావం:-
రావణా! రాముడు సంధించిన బాణం భూమండలమంతా వేడి నిప్పు రవ్వలు చిమ్ముతుండగా… వజ్రాన్ని కూడా కోస్తూ…వరుస కొండలను కూడా పిండి చేస్తుంది. నీ పది తలలను కనురెప్ప వేసేలోపు ఆ బాణం తుంచి పారేస్తుంది.
పద్యం:-
“భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ!”
పదాలు:-
భండన, భీముడు, ఆర్తజన, బాంధవుడు, ఉజ్జ్వల, బాణ, తూణ, కోదండ, కళా, ప్రచండ, భుజ, తాండవ, కీర్తికి, రామమూర్తికిన్, రెండవ, సాటి, దైవము, ఇక, లేడనుచున్, కడకట్టి, భేరికా, ఢాండ, డఢాండ, ఢాండ, నినదంబులు, అజాండము, నిండ, మత్తవేదండమును, ఎక్కి, చాటెదను, దాశరథీ, కరుణాపయోనిధీ!
భావం:-
కరుణకు నెలవైన దశరథ కుమారా! ఓ శ్రీరామా! యుద్ధంలో శత్రువులకు నీ రూపంతో భయం కలిగించినవాడివి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే చుట్టానివి. బాణాలు, అమ్ములపొదులు కలిగినవాడివి. విలువిద్యా కళలో కీర్తికలవాడివి. అటువంటి నీకుసాటిరాగల వేరొక దైవం లేడు. నీ కీర్తి స్తంభాన్ని నాటి, మదించిన ఏనుగును ఎక్కి, భేరిక వంటి చర్మవాద్యాల మీద నుంచి వచ్చే ‘ఢాం ఢాం’ ధ్వనులతో మార్మోగిపోయేట్లుగా ఈ విషయాన్ని అందరికీ తెలియచేసేలా ప్రకటిస్తాను.
-భక్త రామదాసు దాశరథీ శతకం
పద్యం:-
“నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జదుషండ మండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్!”
ఇది మీ కనుల ముందు ఊహించండి!
భావం:-
నిలకడగా వర్షం కురుస్తున్నప్పుడు దట్టమైన మబ్బులలో అగ్నికణాల మాలలు ఒక్కసారిగా బహిర్గతమై దండలుగా ఏర్పడి బ్రహ్మండమైన శబ్దంతో పిడుగులు అదేపనిగా ఒకదాని వెంట మరొకటి వస్తే ఎలా ఉంటుందో…అలాంటి శబ్దం ఆ విల్లు విరిగినప్పడు ఫెళఫెళారావాలు వచ్చాయి.
-విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం
ఎవరు…ఏ వేళ…ఏ ఆపదలో రక్షించమని అడుగుతారో అని రాముడు రాత్రి పడుకున్నప్పుడు కూడా అమ్ములపొది పక్కనే పెట్టుకుని… ఎందుకయినా మంచిదని ఒక బాణాన్ని కూడా చేతిలో పెట్టుకుని ఉంటాడు.
రేపు- పిబరే రామరసం-5
చివరి భాగం
“రామానుబంధాలు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు