Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంముగ్గు.. ఓ అందమైన కళ

ముగ్గు.. ఓ అందమైన కళ

VM Brothers – MuraiVaasal: ముగ్గు…. దక్షిణాదిన ప్రతీ సంప్రదాయ కుటుంబ లోగిళ్లలో.. చుక్కలు, గీతలను కలుపుతూ ప్రతీ ఇంటిముందు ఆకట్టుకునే ఓ అందమైన డిజైన్. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ప్రతీ ఇంటి ఫ్లోర్ పై దర్శనమిస్తూ కొత్త కళను సింగారించే ఓ ఆర్ట్ ఫామ్. గుళ్లల్లో పండుగ వేళ.. చుక్కలు, గీతలకు బదులు.. దీపాలంకరణ రూపంలో భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసే కాంతివెలుగు. కొత్త సంవత్సరం సమీపిస్తోందంటే చాలు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతీ ఇంటి ముందూ ఆడపడుచులు అత్యంత శ్రద్ధగా ఆరంభించే ఓ సంబరం. సంక్రాంతి వచ్చిందంటే కళ్లాపి చల్లి గొబ్బెమ్మలు.. హరిదాసులు.. డూడూ బసవన్నల రాకల నడుమ నడిరోడ్డు వీధులపై ఇంటింటా కనిపిస్తూ మురిపించే కమనీయ దృశ్యకావ్యం.. ఇలా ముగ్గు ప్రత్యే’కథ’ అంతా ఇంతా కాదు. అయితే మగువలకు మాత్రమే పరిమితమైన ముగ్గును.. మగవారూ మొదలుపెడితే…? కోలమ్ పేరుతో తమిళనాడులోనూ కనిపించే ఆ సంప్రదాయ కళను.. అమ్మ, అమ్మమ్మల స్ఫూర్తితో చేపట్టి.. ఇన్ స్టాలో దుమ్ముదులిపేస్తున్న ఓ సోదరులిద్దరి ఈ స్టోరీ చదివేయండి మరి!

ఓ వైపు కరోనా ఎన్నో జీవితాలను అతలాకుతలం చేయడమేకాదు… బలిగొంది కూడా! ఇంకోవైపు మరెన్నో జీవితాల్లో అనూహ్యమైన మార్పులకూ కారణమైంది కూడా. అదిగో అలా కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు…అమ్మ ఇచ్చిన స్ఫూర్తితో ముగ్గులు వేయడం ప్రారంభించారు. వారు వేసిన వివిధ రకాల డిజైన్ ముగ్గులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్! చెన్నై తిరువొత్తియార్ కు చెందిన వీ.ఎమ్. రవిశంకర్, వీ.ఎమ్. సూర్య…ఈ ఇద్దరి ద్వయం తమిళనాడులో ‘కోలం’గా పిల్చుకునే ముగ్గులను కళను కరోనా కాలాన మరింత ప్రాక్టీస్ చేసి… ఇప్పుదు ఏకంగా  ముగ్గులు వేసే పురుషుల జాబితాలో చేరిపోయి ట్రెండ్ సెట్ చేసేశారు. చుక్కలు, గ్రిడ్స్, రేఖలాధారంగా గీసే ముగ్గులంటే… చిన్ననాటి నుంచే ఆసక్తి కనబర్చేవారట ఈ బ్రదర్స్. తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ ముగ్గుల్లో కలర్స్ కూడా నింపేవారు. ఆ ఆసక్తే.. కరోనా కాలంలో సంప్రదాయ కళైన కోలం మీదకు తమ మనసును మళ్లించిందంటారు ఈ సోదరులిద్దరూ.

ప్రతిరోజూ తెల్లవారుజామున్నే నిద్రలేచి.. మహిళలు మెత్తగా రుబ్బిన బియ్యం పిండిను ఉపయోగించి.. ఇంటి గుమ్మంలో శుభానికి చిహ్నంగా ముగ్గులు గీయడం దక్షిణాదిలోని తెలుగునాడుతో పాటు… తమిళ సంస్కృతిలోనూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరు సోదరులకు లాక్డౌన్ సమయంలో… 2020 ఏప్రిల్ లో ముగ్గులపైకి మనసు మళ్లింది. అలా తమిళనాట కోలం ఆర్ట్ కు సంబంధించిన పలు పుస్తకాల్లో చూస్తూ.. డిజైన్స్ వేయడం నేర్చుకున్నారు. బియ్యపుపిండితో ముగ్గులు వేసేముందు నీళ్లతో చాన్పు చల్లే క్రమంలో కూడా ఎంతో జాగ్రత్తవసరం. ఎందుకంటే నీళ్లెక్కువైనా… బియ్యపు పిండితో ముగ్గు వేయడానికి అనువుగా ఉండదు. అదిగో ఆ బాధలన్నీ ఎదుర్కొన్నారు. మొత్తంగా తల్లి నుంచి ముగ్గుల వారసత్వ సంప్రదాయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘మురైవాసల్’ పేరుతో ఇన్ స్టాలో వారు షేర్ చేస్తోన్న ముగ్గులకు విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఇప్పుడు ఈ అన్నదమ్ముల మురైవాసల్ పేజ్ ఫాలోవర్స్ సంఖ్య అక్షరాలా 35 వేలు.

రంగుల బాల్యం
ముగ్గంటేనే రంగు. రంగు రంగుల ముగ్గులెంత కళగా కనిపిస్తాయో… బాల్యమూ ముగ్గుల వలే అందమైన రంగుల హరివిల్లు. అలా రవిశంకర్, సూర్య ఇద్దరూ తమ తల్లి కోలం గీస్తుండగా చూస్తూ పెరిగారు. నాలుగైదు చుక్కలతోనే గీసే ముగ్గుల నుంచి… రకరకాల డిజైన్స్ లో ఆమె శ్రద్ధగా వేసే తీరు ఈ సోదరులిద్దర్నీ చిన్ననాటే ఆకట్టుకుంది. మార్గశిర మాసం నుంచి మొదలయ్యే కోలం కోలాహలం… అలా సంక్రాంతి వరకూ జనవరి మాసం మొత్తం.. వారి బాల్యంలో ఓ అనిర్వచనీయ అనుభూతికి సాక్షీభూతం! అలా సందడి సందడిగా కోలమ్స్ తో సాగిన ఆ చిన్ననాటి గుర్తులనే… మళ్లీ ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఓ ఐడియానే ఈ ఇద్దరినీ కోలమ్ ఆర్టిస్టులుగా మార్చేసింది. రంగురంగుల్లో రకరకాల డిజైన్లతో పాటు… చిన్న చిన్న సందేశాలతో వాటిని నోట్ బుక్స్ లో ప్రాక్టీస్ చేస్తూనే… ఇప్పుడేకంగా ఫ్లోర్స్ పై గీయడంలో నిష్ణాతులయ్యారీ అన్నదమ్ములు.

కాలేజీ, ఆ తర్వాత వ్యక్తిగత జీవితాలతో బిజీగా మారిన అనంతరం… సర్వసాధారణంగానే బాధ్యతల వలయంలో ఈ సోదరులిద్దరికీ ఎందరిలానో ఆ టింజ్ తగ్గిపోయింది. అయితే మళ్లీ తమ సంప్రదాయాలను పునురుద్ధరించాలనే ఒక థాట్ పోలీసింగ్ కు… కరోనా కాలమే కారణమైంది. అలా చిన్ననాట తల్లికి కోలమ్ గీయడంలో అందించిన తోడ్పాటును గుర్తు చేసుకుని… మళ్లీ ప్రారంభించారు. అలా తిరిగి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ముగ్గులేయడం ఏమంత ఈజీగా ఒంటబట్టలేదు. కానీ ‘ప్రాక్టీస్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట’న్నట్టుగా… అప్పటివరకూ ఉమెన్ కు మాత్రమే పరిమితమైన ముగ్గుల కళలో ఈ ఇద్దరూ ఆరితేరారు. అయితే వీరిద్దరి ఇన్ స్టాకు ఎందరు ఫాలోవర్స్ ఉన్నారో అదేస్థాయిలో మీమ్స్, ట్రోల్సూ కూడా ఉంటాయి. కొందరు మెచ్చుకుంటూ పొగడ్తలు కురిపిస్తే… మరికొందరు మహిళలు వేసే ముగ్గుల్ని మీరు వేయడమేంట్రా అంటూ హేళన చేస్తారు. సెటైర్స్ వేస్తారు. వ్యంగ్యంగా కామెంటుతారు.

 Kolam Art

అయినా సరే.. కళ అనేది మహిళలకు మాత్రమే సొంతమైందేమీకాదని… మగువలతో పాటు.. పురుషులూ వేయొచ్చన్న మోటోతో ముందుకెళ్తూ తమకంటూ ఓ ప్రత్యే’కథను’  తయారు చేసుకున్నారు రవిశంకర్ అండ్ సూర్య బ్రదర్స్. ఇప్పుడీ సోదరుల ద్వయం.. కోలమ్ లోని సిక్కు, పుల్లి, పడి వంటి ఎన్నోరకాల ప్రయోగాలతో ముగ్గులతో ఆకట్టుకుంటోంది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా… ఆసనాలను కోలంగా గీసి అబ్బురపర్చి సోషల్ మీడియా వార్తల్లో వైరలైంది ఈ సోదరుల జంట.

(Photos Courtesy: MuraiVaasal)

– రమణ కొంటికర్ల

Also Read

కాలం చెక్కిన పెన్సిల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్