రాష్ట్రంలో ఉత్కంఠ భరితమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం జరిగి తుది అంకానికి చేరుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం 10 ఏండ్లు అధికారంలో ఉన్నది. అభివృద్ధి చేసిన తమకు మూడోసారి అధికారాన్ని ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ పోయిన ఎన్నికల కంటే మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. అగ్రనేతల ప్రచారంతో బిజెపి చాలా చోట్ల బలపడింది. రెండంకెల సీట్లు ఖాయమని కమలనాథులు విశ్వాసంతో ఉన్నారు. బీఎస్పీ కొన్ని ప్రాంతాల్లో ప్రధాన పార్టీలను కలవరపరుస్తోంది. రాష్ట్రంలో ద్విముఖ పోటీలు, కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంది.
ఓటు హక్కు వినియోగించుకునే ముందు పౌరులు…ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలను మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయిదేళ్ళ కాలంలో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే విద్యా, వైద్యం, రవాణ, ఉపాధి వంటి కీలక రంగాలు ప్రభావం చూపుతాయి. వీటిల్లో మార్పులు, అభివృద్ధి, నిర్లక్షం తదితర అంశాలపై అధ్యయనం చేస్తూ… వాటిని ఎట్లా మెరుగు పరుచుకోవాలన్న చర్చ, చర్యలే ప్రజాస్వామ్యనికి చిరునామాలని రాజనీతిజ్ఞులు చెపుతున్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు వాటిపై చర్చ, సమాలోచనలు, ప్రశ్నించే దిశగా కదిలితేనె ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం వస్తుందని అంటున్నారు.
మన నేతలు నిజంగా మన ప్రతినిధులుగా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఇది మనం పట్టించుకోవల్సిన ప్రధానమైన ముచ్చట. మనం ఎన్నుకునే ప్రతినిధి కేవలం ఏదో ఒక పార్టీకి చెందిన మనిషి మాత్రమే కాదు… సదరు నేత తనను ఎంపిక చేసి పంపిన ప్రజలకు, ప్రాంతానికి చెందిన ప్రతినిధి కూడా. ఈ అంశాన్ని నిరంతరం ప్రజా ప్రతినిధికి గుర్తు చేసే బాధ్యత పౌరులదే. పార్టీలా మేనిఫెస్టోతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది.
పౌరుడిగా ప్రజాస్వామ్యంలో తప్పక నిర్వహించాల్సిన బాధ్యత ఓటు హక్కు వినియోగించుకోవటం. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటు వేయాలి. ఎన్నికల సమయంలో రాజకీయాలు ప్రజలను అమితంగా ప్రభావితం చేస్తాయి. ప్రజాస్వామిక పరిధిని విస్తరించుకునే పని ప్రజల మీద ఉన్నది. అది నిరంతర ప్రక్రియ. వాటిలో ఒకటి ఓటు వేయడం. నిరాశ చెందకుండా ఓటు వేయటం పౌరుల ప్రధాన బాధ్యత.
రేపు ఎవరు గెలిచి అధికారంలోకి వచ్చినా… తెలంగాణ జన జీవితాన్ని సజావుగా ఉంచుకోవడానికి, పాలన ప్రజాస్వామికంగా సాగే విధంగా… ప్రజాప్రతినిధులు బాధ్యతతో మెలిగే దానికి… ప్రజలు తయారు కావలసి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అది ఓటు అనే వజ్రాయుధంతో మొదలు అవుతుంది… ముగిసి పోదు.
-దేశవేని భాస్కర్