ఎవరికైనా మనం చేతనైనంత సాయం చేయాలి. ఒకవేళ సాయం చేసే పరిస్థితి లేకపోయినా, హాని మాత్రం చేయకూడదు. ఒకవేళ మన వలన అవతలవారు ఆపదలో పడితే, వాళ్లను రక్షించవలసిన బాధ్యత కూడా మనదే. మనం చేసిన పుణ్యం మనం ఆపదలో ఉన్నప్పుడు వెతుక్కుంటూ వస్తుంది. అలాగే మనం చేసిన పాపం కూడా అదే రూపంలో మనలను ఆపదలోకి నెడుతుంది. కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించవలసిందే అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక సందేశంతో రూపొందిన వెబ్ సిరీస్ ‘వ్యూహం’.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సిరీస్, నిన్నటి నుంచి ‘అమెజాన్ ప్రైమ్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. శశికాంత్ శ్రీవైష్ణవ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక దంపతులకు జరిగిన ప్రమాదానికి సంబంధించిన కేసు ఆయన దగ్గరికి వస్తుంది. అది ఒక హిట్ అండ్ డ్రైవ్ కేసుగానే భావించి రంగంలోకి దిగిన ఆయనకి ఎలాంటి అనూహ్యమైన పరిస్థితులు ఎదురయ్యాయనే దిశగా కథా వెళుతుంది.
ఈ సిరీస్ లో కథా పరిథి ఎక్కువ. కాస్త పేరున్న ఆర్టిస్టులనే తీసుకున్నారు. చాలామంది ఆర్టిస్టులు ఈ సిరీస్ లో కనిపిస్తారు. ఇంట్రెస్టింగ్ మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. అక్కడక్కడా కాస్త సాగదీసినట్టుగా అనిపించినా, కథను ఫాలో కావొచ్చు. యాక్షన్ సీన్స్ ను కూడా బాగానే తీశారు. బూతులు లేకుండా .. అసభ్యకర సన్నివేశాలు లేకుండా చూసుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారు, ఈ సిరీస్ ను చూడొచ్చు.