Saturday, January 18, 2025
Homeసినిమావహ్వా! వహీదా రెహమాన్!

వహ్వా! వహీదా రెహమాన్!

ఒక పాతాళ భైరవి చూస్తే జై పాతాళ భైరవి అనాలనిపిస్తుంది.
మాయాబజార్ చూస్తే భళి భళీ అనిపిస్తుంది.
ఎన్నో పౌరాణిక చిత్రాలు నలుపు తెలుపుల్లోనే ఎంతగానో అలరించాయి. రంగుల్లో వచ్చిన , పాకీజా, మేరా నామ్ జోకర్ వంటి చిత్రాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. దానవీరసూర కర్ణ లాంటి సినిమాల్లో సెట్టింగులు అద్భుతం. అలాగే ఇప్పటి బాహుబలి,మగధీర వంటి చిత్రాలు కూడా.

అలాగే హిందీలో వచ్చిన తాజ్ మహల్, పాకీజా,కాశ్మీర్ కి కలి వంటి చిత్రరాజాలు. ఇప్పటికీ నలుపు- తెలుపుల్లో మళ్ళీ మళ్ళీ విడుదలై ఈ తరం వారిని కూడా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని రంగులు అద్దుకుని మళ్ళీ విడుదలవుతున్నాయి . మన దగ్గర అంతగా లేదు కానీ విదేశాల్లో యూనివర్సల్ స్టూడియో వంటి చోట్ల అలనాటి చిత్రాల సెట్టింగులు కనువిందు చేస్తాయి. హిచ్ కాక్ మొదలుకొని స్పీల్ బర్గ్ వరకు వారు తీసిన చిత్రాల తాలూకు సెట్టింగ్స్ కనువిందు చేస్తాయి. నిజానికి అపురూపమైన చలనచిత్రాల సంపద భావితరాల వారికి తెలిసేలా ప్రభుత్వం లేదా సినీ ప్రముఖులు చొరవ తీసుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఒక మ్యూజియం లాంటిది పెట్టి పాత చిత్రాల వివరాలు, వాడిన వస్తువులు ఉంచితే ఎంతో బాగుంటుంది. ఇటువంటి అరుదైన కార్యానికి పూనుకున్నారు శివేంద్ర సింగ్ దుంగార్పూర్. 2014 లో ముంబై కేంద్రంగా ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ నెలకొల్పి పాత చిత్రాల పరిరక్షణకు, పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ . అలా పునరుద్ధరించిన చిత్రాలు మళ్ళా ప్రదర్శిస్తున్నారు కూడా. ఆ క్రమంలో విడుదలై వందేళ్లయిన సందర్భంగా పునరుద్ధరించిన గైడ్ సినిమా ప్రదర్శించారు. దానికి ఆ సినిమా హీరోయిన్ వహీదా రెహమాన్ ను ఆహ్వానించారు.

వహీదా…చక్కటి నటి. సినిమాలనుంచి విరామం తీసుకున్నా అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కున మెరుస్తూ ఉంటారు. ఫోటోగ్రఫీ అంటే చెప్పలేని మక్కువ. నటించేటప్పుడు కూడా దర్శక నిర్మాతలను అడిగి ఆయా చిత్రాలు దాచుకునేవారు. పదేళ్లుగా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లతో కలసి అడవులు చుట్టేస్తున్నారు. ఎనభైదాటిన వయసులోనూ ఏదో ఒక వ్యాపకంతో గడుపుతూ ఉంటారు. తన పాత సినిమా గైడ్ ప్రదర్శనకు ఎవరొస్తారులే అనుకున్న వహీదా ఆ సినిమాకి లభించిన ఆదరణ చూసి ముగ్ధులయ్యారు. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ కృషి ని గుర్తించారు. తనదగ్గర ఉన్న సినిమాల తాలూకు గుర్తులు వారు మాత్రమే సంరక్షించ గలరనే నమ్మకానికి వచ్చారు. ఓ శుభ ముహూర్తాన ఫౌండేషన్ వారిని పిలిచి తన సినిమా ఫోటోల ఆల్బమ్స్, 1956 లో సిఐడి చిత్రం ప్రీమియర్ కి కట్టుకున్న చీర, ట్రోఫీలు, ఫౌండేషన్ కి అందజేశారు. ఆమె ఫొటోల్లో సినిమా షూటింగ్ విశేషాలు ఉండటం విశేషం. తను ఉన్నా లేకున్నా ఫౌండేషన్ వారి మ్యూజియం లో తన సేకరణ భద్రంగా ఉంటుందని వహీదా నమ్మకం. అందుకే మరే ఇతర హీరో లేదా హీరోయిన్ తలపెట్టని ఔదార్యం చూపారు.

ఇక్కడో చిన్న మాట. స్వర్గీయ ఎన్టీఆర్ వద్ద సినిమాల తాలూకు సేకరణ ఎంతో ఉందని చెప్పేవారు. అంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరూ ఆయనకు సంబంధించి ప్రదర్శనశాల వంటిది ఏర్పాటు చెయ్యలేదు. ఎవరన్నా సినీ ప్రేమికులు పూనుకుని ఇక్కడా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్