Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాచుకోండి! కరోనా వేవ్ లు ఇంకా చాలా ఉన్నాయట!

కాచుకోండి! కరోనా వేవ్ లు ఇంకా చాలా ఉన్నాయట!

నెత్తిన పిడుగు పడ్డట్టు, కాలికింద భూమి నిలువునా చీలినట్లు, కులగిరులు కుంగినట్లు, సప్త సముద్రాలు కట్టగట్టుకుని ఒకేసారి మీదపడ్డట్టు, ప్రకృతి పగబట్టినట్లు… అట్లు…ఇట్లు…ఎట్లయినా అనుకోవచ్చు. కానీ ఈ వార్త పిడుగు నెత్తినే పిడుగు పడ్డట్టు. కులగిరులను కలవర పెట్టినట్లు. చీలే భూమి వెన్నులో వణుకు పుట్టించినట్లు. సప్తసముద్రాలను ఈడ్చి కొట్టినట్లు.

ఇంతకూ వార్త ఏమిటంటే- కరోనా థర్డ్ వేవ్ ను బ్రహ్మ హరి హరులు దిగివచ్చినా ఆపలేరట. మూడో వేవ్ అయ్యాక నాలుగో వేవ్ రాదని గ్యారెంటీ ఏమీ లేదట. నాలుగు అయిపోక ముందే అయిదో వేవ్ వచ్చినా ఏమీ చేయలేమట. ఈ మాట అన్నది వాట్సాప్ యూనివర్సిటీ అజ్ఞాత అమాయక బాధ్యతారహిత సోషల్ మీడియా విద్యార్థి కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక ప్రధాన సలహాదారు విజయరాఘవన్.

“అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే
ఏ పాట నే పాడను?బ్రతుకే పాటైన పసివాడను!”

“అలలు కదిలినా పోటే ఆకు మెదిలినా పోటే
కలలు చెదిరినా పోటే కలతచెందినా పోటే
ఏ పాట నే పాడను?బ్రతుకే పాడయిన పసివాడను!”

ఒకటి మాత్రం నిజం. పేరు కరోనానే అయినా ఒకరికి వచ్చినదే అందరికీ వచ్చినట్లు కాదు. ఎవరి కరోనా వారికి ప్రత్యేకం. ఆగిన ధరణి పోర్టల్లో మ్యుటేషన్లు రావచ్చు. కానీ వచ్చిన కరోనా మ్యుటేషన్లలో ఏది ఏ దేశం నుండి వచ్చిందో? ఏది ఎంత ప్రమాదకరమయినదో? చెప్పగలిగిన నిపుణులు లేరు. దిశ ఉన్నది దేశం. అయితే దశ- దిశ మనుషులకు. కరోనా మనిషి కాదు. కనీసం ప్రాణి కూడా కాదు. కాబట్టి దిశ దశ దేశాలు సరిహద్దులకు అది అతీతం.

టైటానిక్ ఓడ మునుగుతుంటే బాధ్యతగా వెళ్లలేక వెళ్లలేక వాద్య బృంద సభ్యులు ముగ్గురు తుది విషాద గీతం వినిపిస్తూనే పోతారు. గుండెలు పిండేసే సన్నివేశం. అలా కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఎవరిపని వారు చేస్తూ మాట్లాడుతున్నవారు మాట్లాడుతూనే పోతున్నారు.

నిన్న వెంటిలేటర్- ఈరోజు మరణ వార్త. మొన్న అడ్మిషన్- ఈ రోజు అంత్య క్రియలు. ఆ మొన్న ఆక్సిజన్ సిలిండర్- నిన్న ప్రాణవాయువు అనంత వాయువుల్లో.

అంతటి సాంకేతిక సలహాదారు ఇచ్చిన సలహా ఏమిటంటే- సెకండ్ వేవ్ తరువాత ఇంకా ఎన్ని వేవ్ లు వస్తాయో చెప్పలేం. మూడో వేవ్ వచ్చే ముందు సెకెండ్ వేవ్ పోతుంది. మూడో వేవ్ ఎప్పుడొస్తుందంటే సెకండ్ వేవ్ అయిపోయిన వెంటనే. అలలు నిలకడ లేనివి. వేవ్ స్వభావమే చంచలం. ఆయన మాత్రం ఎలా చెప్పగలుగుతారు?

అంటే-
కరోనా ఇప్పట్లో పోదా? ఎప్పటికీ పోదా?

అలలు కదిలినా
కాలు కదిపినా
ఇల్లు దాటినా
తుమ్మినా
దగ్గినా
ఊపిరి తీసుకున్నా
వదిలినా…
ఇప్పుడు కరోనానే.

హలో!
మీరు ఏ వేవ్ లో ఉన్నారు?

మూడు. మీరు?

మాది డైరెక్ట్ గా అయిదు.

అబ్బా మీరే అదృష్టవంతులండీ.
మేమింకా మూడు అయి, నాలుగు దాటాలి. ఎన్ని యుగాలు పడుతుందో?

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్