Friday, November 22, 2024
HomeTrending Newsఅధికార చిహ్నంపై అధికార విపక్షాల వార్

అధికార చిహ్నంపై అధికార విపక్షాల వార్

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను మారుస్తామని సిఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెపుతున్నారు.  గత ప్రభుత్వ ఆన‌వాళ్లు లేకుండా చేస్తాన‌ని రేవంత్ రెడ్డి ప‌లుమార్లు బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో టీఎస్ స్థానంలో టీజీ తీసుకొచ్చారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అధి అమలులోకి వచ్చింది. తాజాగా అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారు.

రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ తోర‌ణం ఉండ‌దని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (మంగళవారం) పేర్కొన్నారు. సమ్మక్క – సారక్క, నాగోబా జాతర స్ఫూర్తికి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుంద‌ని, పోరాటాలు, త్యాగాల‌కు ప్ర‌తిబింబంగా అధికారిక చిహ్నం ఉంటుంద‌ని సీఎం వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్ర అధికారిక చిహ్నంలోని కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని తీసేస్తున్న‌ట్లు  సిఎం నిర్ణ‌యంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమ‌ర్శించారు. కాక‌తీయ క‌ళాతోర‌ణంపై ఎందుకంత కోపం.. చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించారు. ఇదెక్క‌డి మూర్ఖ‌పు ఆలోచ‌నని మండిప‌డ్డారు.

ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తెహజీబ్‌కి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడనట అని కేటీఆర్ మండిప‌డ్డారు.

కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి. “కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి. అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా..? అని కేటీఆర్ నిల‌దీశారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు.

అధికార విపక్షాల వైఖరితో తెలంగాణలో పాలన గాడి తప్పుతోందనే విమర్శలున్నాయి. పాత ప్రభుత్వం తప్పిదాలను సరిదిద్దితే హర్షించతగినదే… టీఎస్ తీసేసి టిజి తీసుకురావటం… ప్రభుత్వ వాహనాలకు విధిగా మార్చటం ఖజానాకు నష్టమని మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారిక చిహ్నంలో మార్పులు కూడా అదే కోవలోనివని వాదనలు వినిపిస్తున్నాయి.

పరిపాలనలో మెరుగైన విధానాలు తీసుకు వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మేధావులు హితవు పలుకుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ కోసం నిధుల దుర్వినియోగం వ్యవహారాల్లో విచారణలు జరగటం తప్పితే ఇంతవరకు ఎవరిని బాధ్యలను చేయకపోవటం దేనికి నిదర్శనమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్