వరంగల్ పరిశ్రమల కేంద్రం కావాలి. గొప్ప విద్యా, వైద్య కేంద్రం కావాలని. తూర్పు తెలంగాణకు ఇది హెడ్ క్వార్టర్ కావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు కెనడాలో ఉన్నాయని తెలిసింది. వైద్యశాఖ అధికారులతో కలిసి కెనడాను విజిట్ చేసి, వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి, కెనడాను తలదన్నేలా ఆస్పత్రి నిర్మాణం ఉండాలన్నారు. అన్ని వైద్య సేవలు ఒకే ప్రాంగణంలో రావాలి. మహిళలు ప్రసవిస్తేనే మనందరం పుట్టాం. మాతాశిశు సంరక్షణ చాలా ప్రాధాన్యమైన అంశం. తెలంగాణ మొత్తం నాగరికంగా మారాలి. ప్రతి పాత తాలుకా సెంటర్‌లో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు రావాలి. ఒక మినీ నిలోఫర్ సెంటర్ రావాలి. వరంగల్‌కు డెంటల్ కాలేజీ, డెంటల్ హాస్పిటల్ మంజూరు చేస్తున్నాం. హైదరాబాద్ వాళ్లు కూడా ఇక్కడికే వచ్చేలా విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలి. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతుంది. వరంగల్‌లో మంచినీళ్ల గోస లేదు. వరంగల్లో పెట్టుబడులు రావాలి. ఐటీ కంపెనీలను విస్తరించాలని సీఎం కేసీఆర్ అన్నారు.
నేను ఆ రెండు ట్యాబెట్లు మాత్రమే వేసుకున్నా.. భయోత్పాతం వద్దు
కరోనా మహమ్మారి విషయంలో మీడియా ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిదని సీఎం సూచించారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం మాట్లాడారు. తనకు కరోనా వచ్చినప్పుడు రెండు ట్యాబ్లెట్లు మాత్రమే వేసుకున్నానని, పారాసిటమాల్‌తో పాటు ఒక యాంటిబయోటిక్ ట్యాబ్లెట్ వేసుకున్నా. డీ విటమిన్ వేసుకోమని చెప్పారు. కానీ అది తాను వేసుకోలేదు. అంతలోనే కరోనా తగ్గిపోయింది. జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నియంత్రించొచ్చు అని సీఎం అన్నారు. మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించి, అనవసరంగా లేని ఉత్పాతాన్ని సృష్టించవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.
వరంగల్ అర్బన్ జిల్లా పేరు మార్పు..
వరంగల్ అర్బన్ జిల్లా పేరును మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చుతున్నామని సీఎం పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ ప్రారంభించుకున్న కలెక్టరేట్ భవనాన్ని హన్మకొండ జిల్లాగా పరిగణించాలి. దీనికి సమీపంలో నిర్మించబోయే కలెక్టరేట్‌ను వరంగల్ కలెక్టరేట్‌గా పరిగణించాలి. పేరు మార్పునకు సంబంధించిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లోనే వస్తాయని సీఎం తెలిపారు.
జయశంకర్ సార్ విగ్రహానికి సీఎం కేసీఆర్ నివాళులు
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళులర్పించారు. హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ విగ్రహానికి సీఎం పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన
అక్కడి నుంచి ఆయన నేరుగా సెంట్రల్ జైలు మైదానానికి వెళ్లి నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని తొలగించి మొత్తం 60 ఎకరాల్లో 24 అంతస్తులతో సకల హాంగులతో ఈ దవాఖానను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2 వేల పడకల సామర్థ్యం, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఈ దవాఖాన ప్రత్యేకత. 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు.
ఆ తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనాన్ని 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.