వైసీపీ ప్రభుత్వం క్రిమినాలిటీని వ్యవస్థీకృతం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న దోపీలకు కారకులైన వైసీపీ నేతలను, వారికి కొమ్ముకాస్తున్న అధికారులను బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. రాబోయేది బిజెపి-జనసేన ప్రభుత్వమా, టిడిపి-జనసేన ప్రభుత్వమా అనేది చర్చలు జరుగుతున్నాయని, అది ఏ రూపం తీసుకున్నా ఇప్పుడు తప్పులు చేసినవారిని అందరినీ జవాబుదారీచేసి శిక్షిస్తామని హెచ్చరించారు. జనసేన వారాహి యాత్ర మూడో విడత ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.
ఉత్తరాంధ్రలో లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారని, ఇక్కడ జరుగుతున్న జరుగుతున్న దోపిడీపై ప్రజలు స్పందించకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నిన్నటి జనవాణిలో 370 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో ఎక్కువగా భూ కబ్జాలపైనే వచ్చాయని పేర్కొన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ గ్రూపులు ఎక్కువగా ఉంటాయని అందుకే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఉత్తరాంధ్ర దోపిడీకి వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారని అన్నారు. అన్నిచోట్లా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్న వారు సారాయి షాపుల్లో ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తాము వచ్చిన తరువాత మద్య నిషేధం చేయాలా లేదా తగ్గించడమా అనే దానిపై లోతుగా ఆలోచిస్తామన్నారు. మందు, గంజాయి డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
టాక్స్ లు, స్కూలు ఫీజులు, స్కూళ్ళకు ఎయిడ్ ఎత్తివేయడం లాంటి వాటిలో కూడా అవినీతికి పాల్పడుతున్నారని పవన్ ఆరోపించారు. గ్రీన్ టాక్స్ కట్టలేక డ్రైవర్ లు వంద, వెయ్యి రూపాయలకు కూడా ఇబ్బంది పడుతుంటే వైసీపీ నేతలు మాత్రం బలిసి కొట్టుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ఖజానా బలహీనపడుతుంటే, సిఎం జగన్ లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి చేశారని, సహజ వనరులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు.
పదేళ్ళపాటు ప్రజల సమస్యలపై అధ్యయనం చేసిన తరువాతే సిఎం పదవి తీసుకోవడం కోసం తాను సిద్ధంగా ఉన్నానని చెప్పానని పవన్ వెల్లడించారు. తన సంసిద్ధత ఒక్కటే సరిపోదని, ప్రజల మద్దతు కూడా కావాలని అన్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు నేతను ఎన్నుకుంటారని, అందుకే తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు గెలవడం ముఖ్యమన్నారు. తనకు ప్రజల్లో అభిమానం ఉన్నా, సభలకు పెద్ద ఎత్తున వచ్చినా ఎమ్మెల్యేలుగా పోటీచేసే వారు కూడా ప్రజల్లో తిరిగి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అయితే ఈ ప్రక్రియలో ఓటు చీలకూడదనేది తమ అభిమతమని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎన్డీయే ఏ రూపంలో ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుందని వెల్లడించారు.