పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదని… ఆంధ్రప్రదేశ్ ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి అన్ని వర్గాల వారినీ ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్రం నంబర్ వన్ గా నిలవాలని, అన్ని కులాల వారూ కలిసికట్టుగా పని చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. యువ గళం పాదయాత్రలో భాగంగా మార్కాపురంలో కమ్మ సామాజిక వర్గ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కులాల్లో ఉన్న పేదవారిని ఆడుకోవడం కోసమే కార్పొరేషన్ లు తమ హయంలో ఏర్పాటు చేశామని, కానీ ఈ ప్రభుత్వం వాటిని రాజకీయ పదవులుగా మాత్రమే చూస్తోందని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా వేధిస్తున్నారని, ఆ పార్టీలో ఉన్న అలజడి మరే పార్టీలో లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎవరు బాగుపడుతున్నా ఓర్వలేరని, అందుకే పారిశ్రామిక వేత్తలను అణగదొక్కుతున్నారని, చివరకు మాగుంట కుటుంబాన్ని కూడా వదల్లేదని విమర్శించారు.
జగన్ పూర్తి ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నారని, తానిచ్చే పప్పు బెల్లాలతోనే ఓట్లు రాలతాయని అనుకుంటున్నారని, వెనుకబడిన వారిని అభివృద్ధిచేస్తే వారికి ఆర్ధిక స్వతంత్రం వస్తుందని, అప్పుడు నిలదీస్తారు కాబట్టి వారికి పథకాల పేరుతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ కు తన మన బేధం లేదని…. అన్నీ తన చేతుల్లోనే ఉండాలనుకునే మనస్తత్వమని విమర్శించారు. ఇప్పటికే సిమెంట్ వారే నడిపిస్తున్నారని, మందు కూడా జగన్ పేరుమీద ఉందని, రాబోయే రోజుల్లో జగన్ సబ్బు, పాలు, పెరుగు, నూనె, చింతపండు కూడా ఆయన పేరుమీదే వస్తాయని ఎద్దేవా చేశారు. రాబోయే టిడిపి ప్రభుత్వంలో కక్షసాధింపు శాఖను తాను పోరాడి తీసుకుంటానని అన్నారు. ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగతంగా దాడి చేయడం వైసీపీకి అలవాటైపోయిందని… సభ్యత, సంస్కారం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే భయపడతారని అనుకుంటున్నారని, అది సరికాదని స్పష్టం చేశారు.
డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రావాల్సిన తనకు లేదని, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానని, ఇప్పటికైనా తాను జాబ్ చేయదల్చుకుంటే కనీసంగా పది కోట్ల రూపాయల ప్యాకేజ్ వస్తుందని చెప్పారు.