వేరే పార్టీలకు చెందిన నేతల కుటుంబ సభ్యులను నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా మద్దతు ప్రకటించారు, పవన్ గెలవాలని ఆకాంక్షించారు. కాగా నేడు అల్లు అర్జున్ నంద్యాలలో వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్ధి శిల్పా రావిచంద్రారెడ్డి ఇంటికి వచ్చారు. వీరిద్దరి మధ్య కుటుంబ స్నేహం ఉంది. బహిరంగంగా చెప్పకపోయినా రవి చేతిని పైకెత్తి గెలిపించాలన్న సంకేతాలు ఇచ్చారు. నేడు నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన బాబు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇవి చెత్త, తప్పుడు, చవక రాజకీయాలని, అసహ్యకరమైనవి అంటూ ధ్వజమెత్తారు. మీ ఇంటికి అల్లు అర్జున్ వచ్చినా… అది కేవలం స్నేహానికే పరిమితమని, దాన్ని రాజకీయాలకు వాడుకోవడం నీచమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్పా రవిని చిన్న సైకో, సండే ఎమ్మెల్యే అంటూ అభివర్ణించారు.
జనసేన పోటీ చేయని చోట్ల గ్లాసు సింబల్ తీసుకొని టిడిపి అభ్యర్ధులను ఓడించాలని కుటిల రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నార్సీ, సీఏఏ చట్టాలకు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఎవరో చెప్పాలని వైసీపీని డిమాండ్ చేశారు. వాళ్ళు గలీజ్ రాజకీయాలు చేసి ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కూడా తాము పొత్తుల్లో ఉన్నప్పుడే మైనార్టీలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చూపామన్ననారు. మాటమీద నిలబడే, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ టిడిపి అని స్పష్టం చేశారు. మాదిగలకు మళ్ళీ ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని భరోసా ఇచ్చారు. బిసిలకు డిక్లరేషన్ ఇచ్చామని.. దాన్ని అమలు చేసి తీరుతామని చెప్పారు. అబ్దుల్ కలామ్ లాంటి వ్యక్తిని రాష్ట్రపతి చేసిన చరిత్ర తమకుందని, కానీ అబ్దుల్ సలీం ఆత్మహత్యకు జగన్ కారకుడయ్యారని దుయ్యబట్టారు.
నంద్యాలలో ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారని అందుకే సామాజిక న్యాయంలో భాగంగా ఎన్ఎండి ఫరూఖ్ కు సీటు ఇచ్చామని ఆయన్ను, ఎంపి అభ్యర్ధి బైరెడ్డి శబరిని గెలిపించాలని కోరారు.