రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఏడు లక్షల మంది గృహ సారథులు రాష్ట్రంలోని కోటి 60 లక్షల కుటుంబాలను రెండు వారాల్లో సందర్శిస్తారని ప్రభుత్వ సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. దాదాపు ఐదు కోట్ల మందిని కలుసుకుంటారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతినిధులుగా వారు వెళుతున్నారని, ప్రతి కుటుంబంతో ఐదు నిమిషాల పాటు సమయం గడిపి ఆ కుటుంబం నుంచి జగన్ ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో వివరాలు క్రోడీకరిస్తారని, జగన్ కు వారి మద్దతు కోరతారని వివరించారు. జగన్ సందేశాన్ని వారికి వివరిస్తారనారు. తాడేపల్లి లోని పాటీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.
గృహ సారథులు సందర్శించే కుటుంబాల్లో అన్ని కులాలు,మతాలూ, రాజకీయంగా విపక్షాలకు మద్దతుగా ఉండేవారు కూడా ఉంటారని, అయినా కానీ అధికారంలో ఉన్న పార్టీ తరఫున వెళ్లి వారి కుటుంబాలను కలవడం దేశ చరిత్రలోనే గొప్ప విషయమని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమం అందించగాలిగామని, అందుకే నాలుగేళ్ళలో మీ ఇంట్లో తమ ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని నమ్మితేనే తనను ఆశీర్వదించాలని సిఎం జగన్ ధైర్యంగా చెప్పగలుగుతున్నారని సజ్జల అన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనేది ప్రజల నుంచి వచ్చిన నినాదమన్నారు.
ఈ కార్యక్రమంలో నాలుగు ముఖ్యమైన అంశాలు…..
1. గత TDP ప్రభుత్వానికి.. ప్రస్తుత YSRCP పాలనను పోల్చి చెప్పే పాంప్లెట్ అందిస్తారు
2. ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలు అడిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని నమోదు చేస్తారు
3. మద్దతు తెలిపిన వారికీ డోర్ మరియు మొబైల్ స్టిక్కర్లు ఇవ్వబడుతాయి
4. 82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు
అని సజ్జల వివరించారు.